చిన్నారి ప్రాణం తీసిన చెట్టు.. మంత్రి షాకింగ్ కామెంట్ | Maharashtra Minister After 11 Year Old Death | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణం తీసిన చెట్టు.. మంత్రి షాకింగ్ కామెంట్

Jul 1 2026 5:03 PM | Updated on Jul 1 2026 5:15 PM

Maharashtra Minister After 11 Year Old Death

ముంబైలో రోడ్డుపక్కన ఉన్న చెట్టు స్కూల్ బస్సుపై కూలి ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చెట్లు కూలడం సహజమే అంటూ చాలా సింపుల్‌గా తీసిపారేశారు. 

"నిన్న జరిగిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఈ విషయంపై ప్రభుత్వం ఈరోజు సభలో ప్రకటన చేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌కు కూడా ఆదేశాలు ఇచ్చాం" అని ఆయన బుధవారం చెప్పారు. సంజయ్‌ షిర్సాట్‌ మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి మంత్రిగా ఉన్నారు.

జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న కొద్దీ ఆయన సమాధానాలు కాస్త మారుతూ వచ్చాయి. "ఒకటి-రెండు చెట్లు కూలడం, పిడుగు పడడం మనిషి చేతిలో ఉండదు. ఏ చెట్టు ఇప్పుడు కూలబోతోందో ముందే తెలిసిపోదు" అని అన్నారు.

ఇదీ చదవండీ: స్కూల్‌ బస్సుపై పడ్డ చెట్టు

మంగళవారం మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సుమారు 70 ఏళ్ల చెట్టు వేర్లతో పాటు కూలి, యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న మేక్ ఫోర్స్ సంస్థ స్కూల్ బస్సుపై పడింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ మృతి చెందాడు. బయటకు తీసిన పిల్లల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చెట్ల తనిఖీ చేయడం కూడా బాధ్యతే కదా? అని సంజయ్‌ను మీడియా ప్రశ్నించింది. "తనిఖీలు చేస్తూనే ఉంటాం" అని మంత్రి చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చెబుతున్నారని మీడియా మళ్లీ ప్రశ్నించింది.

దీనికి సంజయ్‌ స్పందిస్తూ... "అలా కాదు. పనులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చెట్లు కూలడం సహజం. కొన్నిసార్లు గాలి బలంగా వీచితే అవి కూలిపోతాయి" అని అన్నారు. అయితే ఈ ప్రమాదం బాధాకరమని మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి సంజయ్‌ వ్యాఖ్యలను "సిగ్గుచేటు"గా శరద్ పవార్ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో అభివర్ణించారు. "ఇది పూర్తిగా సిగ్గుచేటైన వ్యాఖ్య. ఒక చిన్నారి ప్రాణం పోయింది. అలాంటి సమయంలో చెట్టు కూలడం సహజ ప్రక్రియ అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఇది బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చదివాను. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ల శాఖపై నింద వేస్తోంది. ప్రతి వర్షాకాలానికి ముందు చెట్ల తనిఖీ తప్పనిసరిగా జరగాలి" అని కాస్ట్రో అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ఈ ప్రమాదాన్ని హైకోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "ఈ అంశంపై సభలో ప్రభుత్వ నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను దోచుకుంది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశించగలం" అని నానా పటోలే అన్నారు.

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు."ఈ ఘటన దురదృష్టకరం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూస్తాం. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం" అని కదమ్ చెప్పారు.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ ఈ ఘటనను "అత్యంత దురదృష్టకరం"గా పేర్కొంటూ సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. "చెంబూర్‌లో రావిచెట్టు స్కూల్ వాహనంపై కూలి చిన్నారి మృతి చెందిన ఘటన అత్యంత దురదృష్టకరం. వర్షాకాలంలో చెట్ల కొమ్మలను సమయానికి కత్తిరించడం చాలా అవసరం. నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చెట్లను సంరక్షించాలి. అదే సమయంలో మానవ ప్రాణాలు కూడా అమూల్యం. నిన్న జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. మున్సిపల్ పరిపాలన చెట్ల కొమ్మలను కత్తిరించాలి. బలహీనంగా ఉన్న చెట్లను తొలగించాలి" అని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement