లిక్కర్‌ కేసు: కవిత ఈడీ కేసు విచారణ సుప్రీం కోర్టులో మళ్లీ వాయిదా

Liquor Scam: Kalvakuntla Kavitha Petition Adjourned Again March 13 - Sakshi

ఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈడీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా.. తగినంత సమయం లేకపోవడంతో మరో తేదీన విచారిస్తామని కోర్టు తెలిపింది. 

లిక్కర్‌ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని..  తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటి) చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్‌ వేశారు. దీనిని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం ఇవాళ విచారణ జరపాల్సి ఉంది. అయితే తగినంత టైం లేకపోవడంతో..  వచ్చే నెల 13వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కిందటి ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు.

.. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీంతో సుప్రీం ఈ పిటిషన్‌ను స్వీకరించగా.. విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. 

విడివిడిగానే.. 
ఇక దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌ గత విచారణలో.. పిటిషనర్‌ అభ్యర్థనను బెంచ్‌ తోసిపుచ్చింది. తన పిటిషన్‌కు నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులను ఆమె జత చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు వేర్వేరు కేసులని.. కలిపి విచారణ చేయడం సరికాదని.. కాబట్టి విడిగానే విచారణ జరుపుతామని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top