‘డుంకి’ ట్రావెల్ ఏజెంట్ ఇంట్లో ఈడీ సోదాల్లో లభ్యం
న్యూఢిల్లీ: అమెరికాకు భారతీయులను దొంగచాటుగా తరలించే డుంకి ట్రావెల్ ఏజెంట్ ఇంట్లో జరిపిన తనిఖీల్లో కళ్లు చెదిరే రీతిలో సొత్తు వెలుగు చూసింది. భారతీయుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)బృందాలు ఢిల్లీ, పంజాబ్, హరియాణాల్లోని డజనుకుపైగా ప్రాంతాల్లో సోదాలు జరిపాయి. ఈ సందర్భంగా రూ.4.62 కోట్ల నోట్ల కట్టలతోపాటు, రూ.19.13 కోట్ల విలువైన 313 కిలోల వెండి, 6 కిలోల బంగారం కనిపించాయి.
ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ ఏజెంట్ నివాసాల్లో దొరికిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో అభ్యంతరకరమైన చాటింగ్‌లు కనిపించాయని అధికారులు శుక్రవారం తెలిపారు. హరియాణాలోని పానిపట్‌లో జరిపిన తనిఖీల్లో డుంకి కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు దొరికాయన్నారు. అమెరికాకి అక్రమమార్గంలో వెళ్లాలనుకునే వారి నుంచి ఇతడు ఆస్తి పత్రాలను తన కమిషన్‌లో భాగంగా ష్యూరిటీగా ఉంచుకునేవాడని అధికారులు వివరించారు. అమెరికాలోకి దొంగచాటుగా ప్రవేశించాలనుకునే వలసదారులు గాడిద మాదిరిగా సుదీర్ఘ, కష్టమైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పేందుకే డాంకీ/డుంకీ అనే పదం వాడుతుంటారు.


