బాబును వదలని ‘స్కిల్‌’ | Enforcement Directorate has taken aggressive action in AP State Skill Development scam | Sakshi
Sakshi News home page

బాబును వదలని ‘స్కిల్‌’

Feb 1 2026 4:33 AM | Updated on Feb 1 2026 4:40 AM

Enforcement Directorate has taken aggressive action in AP State Skill Development scam

స్కిల్‌స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు

సీఐడీ సిట్‌ కేసును ఇటీవల అడ్డగోలుగా క్లోజ్‌ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

కానీ దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ.. విశాఖలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో అనుబంధ చార్జిషిట్‌ దాఖలు 

చంద్రబాబు సన్నిహితుల డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన మరో రూ.23.54 కోట్ల ఆస్తులు జప్తు  

షెల్‌ కంపెనీలతో నిధులు కొల్లగొట్టినట్టుగా గుర్తింపు 

చంద్రబాబు సన్నిహితులపై అభియోగాలు నమోదు 

స్కిల్‌ స్కామ్‌ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ 

2014–19 మధ్య బాబు ప్రభుత్వ హయాంలో స్కిల్‌ స్కామ్‌ 

సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు 

అధికారులు వద్దన్నా రూ.371 కోట్లు విడుదల చేసిన అప్పటి సీఎం బాబు.. అందులో రూ.315 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్లు గుర్తింపు.. 2018లో పుణెలో కేంద్ర జీఎస్టీ అధికారుల సోదాల్లో బయటపడ్డ స్కిల్‌ స్కామ్‌

ఆనాటి సీఎంగా అది బయటకు రాకుండా అడ్డుకున్న బాబు 

2019లో సామాజిక కార్యకర్త ద్వారా వెలుగులోకి 

సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన గత ప్రభుత్వం 

సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబును రిమాండ్‌కు పంపిన కోర్టు.. 52 రోజులు జైలులో ఉన్న చంద్రబాబు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సూత్రధారి, కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన స్కిల్‌ స్కామ్‌ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి కొరఢా ఝుళిపించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఈ కేసును సీఐడీతో ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్స్‌’ అంటూ కోర్టులో మూసివేయించుకున్నారు. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మాత్రం ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తేల్చి చెప్పింది.

షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని వివరిస్తూ ఈడీ మరో అనుబంధ చార్జిషిట్‌ (సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్‌ కంప్‌లైంట్‌)ను విశాఖలోని ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో బుధవారం దాఖలు చేసింది. దీనిని కోర్టు అదే రోజు విచారణకు స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన మరో రూ.23.54 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మూసివేసిన నేపథ్యంలో.. ఈ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ స్కామ్‌కు పాల్పడిన తీరును ఈడీ సమగ్రంగా వివరించింది. 

షెల్‌ కంపెనీల ముసుగులో నిధులు కొల్లగొట్టారు 
2014–19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టి, షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఈడీ నిర్ధారించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని సీబీఐ న్యాయస్థానంలో ఈ నెల 28న అదనపు చార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2014–19 మధ్య జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ ముసుగులో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. సీమెన్స్‌ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందం చేసుకున్నారు.

కానీ సీమెన్స్‌ కంపెనీ ఒక్క రూపాయి వెచ్చించకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వబ నిధులు విడుదల చేసి డిజైన్‌టెక్‌ కంపెనీ, ఇతర కంపెనీల ద్వారా అక్రమంగా తరలించారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ 1)గా అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమో­దు చేసింది. సీఐడీ సిట్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా అక్రమంగా సింగపూర్‌కు తరలించినట్టు దర్యాప్తులో గుర్తించింది.

చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయం ఉన్న షెల్‌ కంపెనీ­ల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ (సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ), వికాస్‌ ఖని్వల్కర్‌ (డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌ (చార్టెడ్‌ అకౌంటెంట్‌)లను అరెస్టు చేసింది. డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.­31.20 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ 2023 మే నెలలో జప్తు చేసింది. కాగా ఈ స్కామ్‌ దర్యాప్తులో మరిన్ని ఆధారాలను గుర్తించింది. డిజైన్‌టెక్‌ సంస్థకు చెందిన మరో రూ.­23.54 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు  చేసింది. దీంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టైంది. స్కిల్‌ స్కామ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును అడ్డగోలుగా మూసివేసినప్పటికీ, ఈడీ మాత్రం స్కిల్‌ స్కామ్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోందని విస్పష్టంగా ప్రకటించింది. 

ఏపీలో అడ్డగోలుగా కేసు క్లోజ్‌... చంద్రబాబు ఒత్తిడితో సీఐడీ నిర్వాకం 
2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేసే కుట్రకు చంద్రబాబు తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రాకు అప్పగించారు. అప్పటి, ప్రస్తుత డీజీపీలు ద్వారకా తిరుమలరావు, హరీశ్‌ కుమార్‌ గుప్తా, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో పాటు యావత్‌ పోలీసు, న్యాయ శాఖలను లూథ్రా గుప్పెట్లో పెట్టారు. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో చార్జ్‌షిట్లను అటకెక్కించారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. అధికారులను బెదిరించి, లొంగదీసుకుని కేసులు మూసివేయించుకుంటున్నారు. స్కిల్‌ కేసులో కూడా టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్‌ను సీఐడీ వల్లిస్తూ ఆధారాలు లేవంటూ ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా ముద్రవేసింది.

‘ఆ కేసును ఇక క్లోజ్‌ చేయాలని భావిస్తున్నాం.. మీ అభిప్రాయాన్ని వారం రోజుల్లో చెప్పండి’ అని అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ  ఎండీ బంగార్రాజుకు సీఐడీ నోటీసులిచ్చింది. ఆ కేసు నమోదు చేసిన సమయంలో తాను ఎండీగా లేనని, తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. వాస్తవానికి సీమెన్స్‌ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు సీఐడీకి ఫిర్యాదు చేసింది అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా ఉన్న కె. అజయ్‌ రెడ్డి. ఆ కేసును మూసివేయాలని భావిస్తే.. నోటీసులు జారీ చేయాల్సింది అజయ్‌ రెడ్డికి.

కానీ సీఐడీ అధికారులు అప్పటి ఎండీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఫిర్యాదుదారుడినైన తనకు తెలియకుండా స్కిల్‌ స్కామ్‌ కేసు మూసివేతను సవాల్‌ చేస్తూ అజయ్‌ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సీఐడీ అభిప్రాయంతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఏకీభవిస్తూ స్కిల్‌ స్కామ్‌ కేసును మూసివేసింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అజయ్‌ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. కాగా, మరోవైపు ఈడీ మాత్రం ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేయడం... తాజాగా అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం ఈ కేసులో దర్యాప్తు కొనసాగించడం ఎంత ప్రాధాన్యమో తేటతెల్లం చేస్తోంది. దీంతో చంద్రబాబు ముఠా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

అవినీతిని నిర్ధారించిన కాగ్‌ 
రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.  

బాబు అవినీతి స్కిల్‌ ఇదీ.. 
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టుతో కనికట్టు చేశారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీతో సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపెట్టారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే.

చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్‌ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో కనీసం ఒక్క రూపాయి విలువైన ఆరి్థక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ సీమెన్స్‌ అందించలేదు. అయినా, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఆరి్థక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్‌టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. 

ఈ కుంభకోణానికి రాచబాట పరుస్తూ మొత్తం 13 నోట్‌ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చినట్లు సీఐడీ నిర్ధారించింది. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించడంతో ఈ కుంభకోణం బయటపడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.

2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చింది. సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసి, దర్యాప్తు చేపట్టి ఆధారాలతో సహా నిగ్గు తేలింది. ఆ విధంగా కొల్లగొట్టిన నిధుల్లో రూ.77.37 కోట్లు హైదరాబాద్‌లోని టీడీపీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు కూడా దర్యాప్తులో వెల్లడైంది. చంద్రబాబు అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో ఛేదించారు. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షిట్‌ నమోదు చేసింది.

ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023, సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్‌ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యలు సాకు చూపడంతో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దర్యాప్తు నిలుపుదల చేసి.. విచారణకు సహరించకుండా, అడ్డగోలుగా కేసును క్లోజ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement