సాక్షి, హైదరాబాద్: ‘లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు. లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు. జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసి అలాంటిది ఏమీ జరిగి ఉండదు. జగన్ మోహన్‌రెడ్డికి తెలిసి అటువంటిది జరిగితే ఆయన ఊరుకోరు ’అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.
లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు ఆయన విచారణ ముగిసింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నంలో తాను ఆస్తులు కూడగట్టుకున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ ఒక నీచమైన రిపోర్ట్ తయారు చేసిందన్నారు. అందులో పేర్కొన్న ఆస్తులన్నీ తనవే అని చంద్రబాబు, సిట్ చీఫ్ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఉత్తమ ప్రధానమంత్రిగా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రతీ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మెజార్టీ ప్రజలు మోదీని అభినందిస్తున్నారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధ్వానంగా ఉందని, పక్షపాత ధోరణి, కులవివక్ష, అసమర్థతతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


