ఇండ్ భారత్ థర్మల్ కంపెనీ పేరిట బ్యాంకులకు కుచ్చుటోపీ
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు చేసిన మోసాలపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మోసాలపై దర్యాప్తు చేయకుండా కృష్ణరాజు గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించి, దీనిపై ముందుకు వెళ్లడానికి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మరోసారి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ చేసిన మోసాలు చర్చనీయాంశంగా మారాయి.
మోసాల చిట్టా బారెడు..
» ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ పేరుతో రఘురామ కృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు.
» థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకుల నెత్తిన చేయిపెట్టారు.
» పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి.
» తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు కాలిపోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
» 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్‌్కలను స్వాధీనం చేసుకున్నాయి. సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురామతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశాయి.
దివాళా ప్రక్రియ షురూ..
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌ని ఆశ్రయించాయి. ఇండ్ భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంక్‌లకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నాయి.
అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తుల విలువ కేవలం రూ. 872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి.. దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్‌సీఎల్‌టీ దివాళా ప్రక్రియకు అనుమతించింది.
ఫెమా నిబంధనల ఉల్లంఘన.. రంగంలోకి ఈడీ
ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ. 202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ. 200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు.
ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దాంతో విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన ఫెమా అధికారులు.. మారిషస్ కంపెనీ నుండి ఏపీకి చెందిన కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది.


