జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో తొమ్మిదేళ్ల విద్యార్థిని పాఠశాల భవనంలోని నాల్గవ అంతస్తు నుండి దూకి, ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో కుమార్తె పోగొట్టుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
‘ఎన్‌డీటీవీ’ కథనం ప్రకారం జైపూర్ చిన్నారి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూలులోని తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ చిన్నారి గతంలో తాను పాఠశాలకు వెళ్లనంటూ ఏడుస్తున్న ఆడియో రికార్డును ఆమె తల్లి మీడియాకు షేర్ చేశారు. ‘నేను స్కూలుకు వెళ్లాలనుకోవడం లేదు. నన్ను పంపించకండి ప్లీజ్’ అంటూ ఆ బాలిక వేడుకోవడం దానిలో వినిపిస్తోంది.
బాలిక తల్లి శివాని మీనా మీడియాతో మాట్లాడుతూ ఆరోజు తాను ఆ ఆడియోను క్లాస్ టీచర్‌కు పంపించి, తమ కుమార్తెను ఇబ్బందిపెడుతున్న విషయం ఏమిటో తెలుసుకుంటారని అనుకున్నానని తెలిపారు. ఈ విషయమై క్లాస్ టీచర్‌తో పాటు కో ఆర్డినేటర్‌తో కూడా పలుమార్లు మాట్లాడానని, కానీ వారు తన మాటలను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కూలులో తమ కుమార్తె.. ఆట పట్టించడం, బెదిరించడం, లైంగిక వేధింపులు తదితర ఇబ్బందులను కొన్ని నెలలుగా ఎదుర్కొన్నదని శివాని మీనా ఆరోపించారు.
కాగా గతంలో స్కూలులో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌కు హాజరైన బాలిక తండ్రి నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ.. తన కుమార్తెతో పాటు మరో బాలుడిని పలువురు విద్యార్థులు ఆట పట్టించారని అన్నారు. దీనిని టీచర్లకు చెప్పినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే ‘ఇది కోయెడ్ స్కూల్.. మీ అమ్మాయి అబ్బాయిలతో సహా అందరితో మాట్లాడటం నేర్చుకోవాలి’అనిని టీచర్ తనతో వాదించారని తండ్రి వాపోయారు. కాగా ఆ బాలిక పాఠశాలలోని రెయిలింగ్ ఎక్కి దూకడానికి ముందు.. రెండుసార్లు తన టీచర్ వద్దకు నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. అయితే ఆ చిన్నారి టీచర్‌తో ఏమి మాట్లాడిందో వెల్లడికాలేదు. కాగా పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు . ఈ కేసు గురించి డీసీపీ రాజర్షి రాజ్‌వర్మ మీడియాతో మాట్లాడుతూ మృతురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్లు తీసుకున్నామని, వారి ఆరోపణల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్: ‘ఇకపై 10కి ఆఫీసు’


