న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం.. దేశరాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు, ఇతర అవాంతరాలను నివారించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
శీతాకాలం తన ప్రతాపం చూపుతుండటంతో ఢిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ తగ్గుతోంది. ఈ నేపధ్యంలో కాలుష్యానికి కారకమవుతున్న వాహన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన సమయాలను ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 15 నుండి ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు.
ఈ మార్పులు 2026, ఫిబ్రవరి 15 వరకు అమలులో ఉంటాయని, రాజధానిలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే సమయంలో, దానిని అదుపులో ఉంచేందుకు ఈ సమయాలు ప్రవేశపెడుతున్నామని రేఖా గుప్తా తెలిపారు. ట్రాఫిక్ ఒకేసారి పెరగకుండా చూసుకోవడమే దీని ఉద్దేశ్యమని అన్నారు. కార్యాలయ సమయాలను మార్చడం ద్వారా, ట్రాఫిక్ ఇబ్బందులను నివారించవచ్చని, కాలుష్య స్థాయిలను తగ్గించవచ్చని ఆమె అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9:30 గంటలకు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతున్నాయి.
ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యతపై ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ సీనియర్ అధికారుల మధ్య సమావేశం జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా శీతాకాలపు పొగమంచుకు వాహనాల ఉద్గారాలు తోడయినప్పుడు కాలుష్యం మరింత తీవ్ర స్థాయికి చేరుతుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) తెలిపింది. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాలలో అత్యధిక కాలుష్యం వెలువడుతుతోందని సీఎస్‌ఈ గుర్తించింది.
ఇది కూడా చదవండి: ప్రియుడి కోసం భర్తకు ఊచకోత


