మరో భారీ అగ్నిప్రమాదంతో దేశ రాజధాని రీజియన్ ఉలిక్కి పడింది. నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీ యూనిట్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
నోయిడా సెక్టార్-119లో ఉన్న అరణ్య సొసైటీలో సోమవారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలికి గౌతమ్‌బుద్ధ్‌నగర్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO), స్థానిక పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది అపార్ట్‌మెంట్‌లోని ఇతర నివాసితులను అప్రమత్తం చేస్తూ, మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
Fire breaks out in a high rise in sector 119, #Noida pic.twitter.com/82ZkYvGNFl
— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 29, 2026
ప్రస్తుతం వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు..
ఇదిలా ఉండగా ఢిల్లీలో మాత్రం ఉష్ణోగ్రతలతో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. పగటి పూటే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణానికి మించి నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీలు వాడాల్సి వస్తుండగా.. షార్ట్ సర్క్యూట్‌తోనే నోయిడా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కూలర్లు, ఏసీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పౌరులకు సూచిస్తున్నారు.


