ఆత్మాహుతి దాడేనా? | Delhi Explosion: Many experts suspect It was a suicide attack | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడేనా?

Nov 12 2025 1:56 AM | Updated on Nov 12 2025 1:56 AM

Delhi Explosion: Many experts suspect It was a suicide attack

ఢిల్లీలో సోమవారం రాత్రి పేలుడుకు కారణమైన కారులో అనుమానితుడు డాక్టర్‌ ఉమర్‌ నబీ (సీసీటీవీ దృశ్యం), డాక్టర్‌ షాహీన్‌

ఎర్రకోట ఘటనలో కారు పేలుడుపై భిన్నాభిప్రాయాలు 

విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్‌ను ఉగ్రవాది తరలిస్తుండగా ఒత్తిడితో పేలి ఉండొచ్చంటున్న అధికారులు

విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్‌ను ఉగ్రవాది తరలిస్తుండగా ఒత్తిడితో పేలి ఉండొచ్చంటున్న అధికారులు

కారులో డాక్టర్‌ ఉమర్‌ నబీ ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణ 

పేలుడుకు మూడు గంటల ముందు అక్కడే తిష్టవేసిన కారు 

వేలకిలోల పేలుడు పదార్థాల స్వా«దీనం ఘటనతో కారుబాంబు ఘటనకు లింకు 

కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ 

అరెస్టయిన వైద్యురాలు షాహీన్‌ సారథ్యంలో జైషే మహిళా ఉగ్ర విభాగం 

దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు... 12కు పెరిగిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: దేశ రాజధాని నడిబొడ్డున రుధిర ధారల్ని ఎగజిమ్మి యావత్‌ భారతావని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద దుశ్చర్యగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనధికారికంగా ప్రకటించాయి. ఉగ్ర వైద్యుడు డాక్టర్‌ ఉమర్‌ మొహమ్మద్‌ నబీ అత్యంత విస్ఫోటక స్వభావమున్న అమ్మోనియం నైట్రేట్‌ ఫ్యూయల్‌ ఆయిల్‌ (ఏఎన్‌ఎఫ్‌ఓ)తో నిండిన కారును ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై పేల్చేశాడని తొలుత వార్తలొచ్చాయి. 

అయితే ఆరుబయట అధిక వేడిమి, ఒత్తిడి కారణంగా అమ్మోనియం నైట్రేట్‌ పేలిపోయి ఉంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐ20 కారును జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లీథ్‌పురాకు   చెందిన ఉమర్‌ నబీ నడిపినట్లు సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో కారులో ఉన్నది అతనేనా కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఉమర్‌ తల్లి షమీమా బానో నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లను సేకరించారు. 

ఇప్పటికే ఆమెతోపాటు ఉమర్‌ సోదరులు ఆషిక్‌ అహ్మద్, జహూర్‌ అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్‌ ఇంట్లో సోదాలుచేసి కీలక డాక్యుమెంట్లు, ఎల్రక్టానిక్‌ పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. కారు పేలినప్పుడు అందులో ఉమర్‌ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చెందుతున్న క్షతగాత్రులు ముగ్గురు మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో సోమవారం నాటి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 12కు పెరిగింది. 

2,900 కేజీల పేలుడు పదార్థాల స్వాదీనం, ఢిల్లీలో పేలుడు ఘటనలతో అంతటా అలర్ట్‌ ప్రకటించగా రెండు కేసుల్లో మూలాలను వెతికిపట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్, ఎన్‌ఐఏ, నిఘా ఏజెన్సీల బృందాలు దేశవ్యాప్తంగా దర్యాప్తు కోసం బయల్దేరాయి. మంగళవారం కశ్మీర్‌లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్‌ టర్మినళ్ల వద్ద కట్టుదిట్ట భద్రత కొనసాగుతోంది. 

గంటల తరబడి అక్కడే... 
సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఆ కారు ఎర్రకోట సమీప చారిత్రక సునేహ్రీ మసీదు పార్కింగ్‌ ఏరియాకు సోమవారం మధ్యాహ్నం 3.19 గంటలకు వచ్చింది. మూడు గంటలపాటు అది అక్కడే ఉంది. అంటే సాయంత్రం 6.22 గంటలదాకా పార్కింగ్‌లో ఉంది. అందులోని వారెవరూ కనీసం కిందకు కూడా దిగలేదు. పేలుడుకు సంబంధించిన ఉగ్రనెట్‌వర్క్‌ సూత్రధారుల నుంచి ఆదేశాల కోసం అప్పటిదాకా వేచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

సాయంత్రం రద్దీ పెరిగాకే కొద్ది నిమిషాల ముందే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో చొరబడి విధ్వంసం సృష్టించి ఉంటాడని భావిస్తున్నారు. అంతకుముందు కారు సోమవారం ఉదయం ఫరీదాబాద్‌ నుంచి బయల్దేరింది. ఏడున్నరకు ఫరీదాబాద్‌ ఏసియన్‌ హాస్పిటల్‌ వద్ద కనిపించింది. బదార్‌పూర్‌ టోల్‌ ప్లాజా దాటి ఉదయం 8.13 గంటలకు ఢిల్లీలోకి అడుగుపెట్టింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో డ్రైవర్‌ కనిపిస్తున్నా ముఖానికి మాస్క్‌ ఉంది. సెంట్రల్‌ ఢిల్లీ, పాత ఢిల్లీలోని దర్యా గంజ్, కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చక్కర్లు కొట్టి చివరకు ఎర్రకోటకు చేరుకుంది. 

పేలుడు సాయంత్రం 6.52 గంటలకు జరగ్గా ఈ కారు కొన్ని నిమిషాల ముందు ఛాందిని చౌక్‌ వైపు వెళ్తూ హఠాత్తుగా యూటర్న్‌ తీసుకుని వచ్చి సుభాష్‌ మార్గ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి పేలిపోయింది. ‘‘ తోటి ఉగ్రవాదులు ఫరీదాబాద్‌లో అరెస్టయిన వార్తలను ఇంటర్నెట్, మీడియా ద్వారా తెల్సుకుని డాక్టర్‌ ఉమర్‌ పారిపోయి ఉంటాడు. కారులోని పేలుడు పదార్థాలను ఢిల్లీలో ఎక్కడైనా దాచేందుకు వెళ్తూ మార్గమధ్యంలో సిగ్నల్‌ వద్ద అమ్మోనియం నైట్రేట్‌ ఒత్తిడి కారణంగా పేలిపోయి ఉండొచ్చు’’ అని దర్యాప్తు అధికారు ఒకరు అభిప్రాయపడ్డారు. 

కారు ఆర్సీ సల్మాన్‌ మీదనే ఉన్నా పలువురి చేతులు మారి.. 
కారును తొలుత ఎండీ సల్మాన్‌ కొన్నాడు. ఆర్సీ ఇప్పటికీ అతని పేరు మీదే ఉంది. తర్వాత నదీమ్‌ కొనుగోలు చేయగా తర్వాత ఫరీదాబాద్‌లోని రాయల్‌ కార్‌ జోన్‌ దీనిని కొనుగోలుచేసింది. తర్వాత అమీర్, ఆ తర్వాత కశ్మీర్‌కు చెందిన తారిఖ్‌ దార్‌ కొన్నారు. అతను డాక్టర్‌ ఉమర్‌కు అప్పగించాడు. సల్మాన్‌ పేరిట ఆర్సీ ఉన్నా అధికారికంగా ఇంతమంది చేతులెలా మారింది? అనేది తెలియాల్సి ఉంది. తారిఖ్‌ అహ్మద్‌ దార్‌కు ఉగ్రమాడ్యూల్‌తో సంబంధం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత యజమానులందరికీ ఉగ్రవాదంతో సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.  

చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసు 
కేంద్ర ప్రభుత్వం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పేలుడు కోణంలో మాత్రమే చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద కేసు నమోదుచేశారు. ఉగ్రచట్టాల కింద కేసు నమోదుచేయలేదు. సాధారణంగా ఉగ్రవాదం సంబంధిత కేసులను మాత్రమే ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ లెక్కన ఈ పేలుడు ఉగ్ర చర్యేనని పరోక్షంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్లయింది.  

ఎవరీ ఆత్మాహుతి బాంబర్‌? 
36 ఏళ్ల డాక్టర్‌ ఉమర్‌ ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని అల్‌–ఫలాహ్‌ వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఉమర్‌ తండ్రి గతంలో జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉమర్‌ సొంతూరు పుల్వామా సమీప కోయిల్‌ గ్రామం. కారును పేల్చింది ఉమర్‌ అని మీడియాలో వచ్చిన వార్తలు విని ఉమర్‌ వదిన ముఝామిల్‌ హుతాశురాలైంది. ‘‘ ఉమర్‌ పుస్తకాల పురుగు. ఎప్పుడూ వైద్యవృత్తి సంబంధ పుస్తకాలే చదువుతాడు. 

శుక్రవారం కూడా ఫోన్‌లో మాట్లాడాం. గ్రంథాలయంలో ఉన్నానని చెప్పాడు. పేదరికం నుంచి మమ్మల్ని బయటపడేస్తాడనుకున్నాం. ఉగ్రవాదభావంలో మునిగిపోతాడని అస్సలు అనుకోలేదు. ఉమర్‌ తల్లి చిన్నాచితకా పనులు చేస్తూ ఇంకా కష్టపడుతున్నారు. ఉమర్‌ అన్న ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు స్టెనోగ్రఫీ నేర్చుకుంటున్నాడు’’ అని వదిన చెప్పింది. 

షాహీన్‌ కనుసన్నల్లో జైషే మహిళా ఉగ్ర విభాగం.. 
దర్యాప్తు సంస్థ అదుపులో ఉన్న వైద్యురాలు షాహీన్‌ సయీద్‌ గురించి విస్మయకర విషయాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈమె కారులో అసాల్ట్‌ రైఫిల్, పిస్టల్, మందుగుండు లభించడంతో ఉగ్రవాదులకు సాయపడుతోందని భావించి తొలుత ఆమను అరెస్ట్‌చేశారు. కానీ ఈమెనే స్వయంగా అమాయకులను ఉగ్రవాదంలోకి దింపుతున్నారని తెల్సి దర్యాప్తు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. 

షాహీన్‌ ఏకంగా భారత్‌లో జైషే మొహమ్మద్‌ ఉగ్రసంస్థ మహిళా విభాగం ‘జమాత్‌ ఉల్‌ మోమినాత్‌’కు సారథ్యం వహిస్తోంది. ఈ విభాగం జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ పాకిస్తాన్‌లో ఉండి నడిపిస్తోంది. ఫరీదాబాద్‌లోని అల్‌–ఫలాహ్‌ వైద్య కళాశాలలోని తోటి వైద్యుడు ముజామిల్‌ ఘనీతో షాహీన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఘనీకి ఈమె ప్రియురాలు అని తెలుస్తోంది. 

కశ్మీర్‌కు చెందిన ఘనీ ఇప్పటికే ఉగ్రమాడ్యూల్‌ ఉదంతంలో అరెస్ట్‌ అయ్యాడు. ‘‘షాహీన్‌ ధోరణి విచిత్రంగా ఉండేది. మెడికల్‌ కాలేజీలో ఆమె ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేది. చెప్పకుండా బయటకు వెళ్లిపోయేది. ఆమెకు కలిసేందుకు ఎంతోమంది వచ్చేవారు. సరిగా విధులు నిర్వర్తించట్లేదని ఆమెపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఆమె ఏకంగా ఉగ్ర రిక్రూటర్‌ అని తెల్సి నమ్మలేకపోతున్నాం’’ అని కాలేజీ యాజమాన్యం పేర్కొంది.  

త్వరగా నివేదిక ఇవ్వండి: అమిత్‌ షా 
ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సారథ్యంలో రెండు సార్లు అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ‘‘ ఈ పేలుడు ఘటన వెనక ఉన్న ప్రతి ఒక్కడినీ వేటాడండి. కారకులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాం. పేలుడుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిపైనా దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయి. కేసును దర్యాప్తుచేసేందుకు దేశంలోని అత్యున్నత స్థాయి బృందాలు రంగంలోకి దూకాయి. ఘటన మూలాల్లోకి వెళ్లిమరీ దుశ్చర్యకు కారకులను బయటకు లాగుతాం’’ అని అమిత్‌ షా అన్నారు. 

కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ డేకా, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ సదానంద్‌ వసంత్‌ దాటె, జమ్మూకశ్మీర్‌ డీజీపీ నళిన్‌ ప్రభాత్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కారు పేలుడు, పేలుడు పదార్థాల స్వా«దీనం కేసుల పురోగతిపై అమిత్‌కు అధికారులు వివరాలు వెల్లడించారు. తర్వాత భద్రతా సమీక్షపై మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. ఇందులోనూ వీళ్లే పాల్గొన్నారు. వీళ్లకుతోడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ సర్వీసెస్‌ డైరెక్టర్, ఢిల్లీలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లే»ొరేటరీ చీఫ్‌ డైరెక్టర్‌లు దర్యాప్తు తీరును వివరించారు.  

భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేట్‌ ఉగ్రవాదులకు ఎలా లభించింది? 
పొలాల్లో ఎరువుగా నైట్రోజన్‌గా పనికొచ్చే అమ్మోనియం నైట్రేట్‌ను విధ్వంసం కోసం ఉగ్రవాదులు వేల కిలోలకొద్దీ సేకరించిన తీరుపై దర్యాప్తు కొనసాగుతోంది. క్వారీలో రాతిని బద్దలుకొట్టేందుకు అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. నిషేధిత రసాయనం అమ్మోనియ నైట్రేట్‌కు పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ను మిశ్రమంగా కలిపితే అత్యంత పేలుడు పదార్థం(ఐఈడీ) తయారువుతుంది. దీనిని ఉగ్రవాదులు గతంలో కశ్మీర్, ముంబై, ఢిల్లీలో దాడుల్లో ఉపయోగిస్తున్నారు. 

అమ్మోనియం నైట్రేట్‌ ఫూయల్‌ ఆయిల్‌(ఏఎన్‌ఎఫ్‌ఓ)కు అత్యంత వేగంగా మండే స్వభావం ఉంది. ఈ రసాయనాన్నే ఆర్‌డీఎక్స్‌తో కలిపి 2019లో పుల్వామాలో సైనిక వాహనశ్రేణిపై దాడికి ఉగ్రవాదులు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఉగ్రమాడ్యూల్‌ల వద్ద ఈ రసాయనం భారీ స్తాయిలో ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement