న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని భయాందోళనలోకి నెట్టివేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు బృందాలు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిఘా వర్గాల నుంచి ఒక కీలక సమాచారం వెల్లడయ్యింది.
ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ దర్యాప్తు అధికారుల విచారణలో.. తాను, ఉమర్.. ఎర్రకోట ప్రాంతానికి పేలుడు జరగడానికి ముందుగా చేరుకున్నామని చెప్పాడు. వచ్చే ఏడాది జనవరి 26న దాడి చేసేందుకు ప్రణాళిక ఉందని, దానిలో భాగంగా ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాన్ని గుర్తించామని ముజమ్మిల్ తెలిపాడు. అదేవిధంగా మొన్నటి దీపావళికి రద్దీగా ఉండే ప్రాంతంలో దాడి చేయాలని తాము ముందుగా ప్లాన్ చేశామని, అయితే దానిని అమలు చేయలేకపోయామని ముజమ్మిల్ విచారణ అధికారులకు తెలిపినట్లు ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది.
ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన దరిమిలా దర్యాప్తు బృందం కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్‌ను విచారిస్తున్నారు. ఇతను ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఇతని సహోద్యోగి ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో కారు పేలి మరణించినట్లు భావిస్తున్నారు. మూలాల ప్రకారం ముజమ్మిల్‌ను విచారిస్తున్న పోలీసులు అతని ఫోన్ డేటాను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం


