అజయ్‌ను ఆస్పత్రికి తీసుకొస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) గాయపడ్డ సీఐ
మద్యం సేవిస్తుండగా స్నేహితుల మధ్య గొడవ
రాజా అనే యువకుడిని కత్తితో పొడిచిన
మరో యువకుడు అజయ్
పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై దాడి చేయడంతో సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్‌తో కాలి్చన సంచలన ఘటన అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో జరిగింది. వివరాలు.. అనంతపురం నగరం నాయక్‌నగర్‌కు చెందిన చాకలి రాజా, సొహైల్, అక్రం, అజయ్ స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో నగరంలోని అరవిందనగర్‌లో అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ తన స్నేహితుడు చాకలి రాజాను కత్తితో కడుపులో బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ కోసం గాలింపు చేపట్టారు.
మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడికి యత్నం..
నిందితుడు అజయ్ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీవీ టవర్ సమీపంలోని షికారు కాలనీలో ఉన్నాడనే సమాచారం అందడంతో ఇన్‌ఫార్మర్ ఆటోడ్రైవర్ బాబాను వెంట బెట్టుకుని టూటౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్‌ఐ రుష్యేంద్రబాబు, సిబ్బంది మఫ్టీలో వెళ్లారు. పోలీసులు రౌండప్ చేయడాన్ని పసిగట్టిన అజయ్.. తన దగ్గరికి వస్తున్న ఆటోడ్రైవరు బాబాను ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆపై వీరంగం సృష్టిస్తూ మహిళలను కత్తితో బెదిరిస్తూ ముళ్లపొదల్లోకి దూరి పారిపోయాడు.
చెరుకు తోటలో నక్కి ఉండి.. సీఐపై అటాక్..
వరుసగా దాడులకు పాల్పడుతున్న అజయ్‌ను పట్టుకోవాలని సవాల్‌గా తీసుకున్న పోలీసులకు ఆకుతోటపల్లి సమీపంలోని కందుకూరుకు వెళ్లే దారిలో ఓ చెరుకుతోటలో నిందితుడు దాక్కున్నట్లు సమాచారం రావడంతో చుట్టూ మోహరించారు. చెరుకు తోట ఏపుగా ఉండడంతో సీఐ శ్రీకాంత్ లోపలకు వెళ్లి లొంగిపోవాలని కోరాడు. అయితే సీఐ దగ్గరకు సమీపిస్తుండగా అజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో భుజానికి గాయమైంది. మరోమారు దాడి చేసేందుకు రావడాన్ని గమనించిన సీఐ అప్రమత్తమై తన సర్విస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చాడు.
ఒక బుల్లెట్ అజయ్ మోకాలిలో దూరి బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. మరోవైపు సీఐ శ్రీకాంత్ గాయపడడంతో అక్కడే ఉండగా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సీఐ శ్రీకాంత్ పై యువకుడు కత్తితో దాడి చేయడాన్ని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఓ ప్రకటనలో ఖండించారు.
అజయ్‌పై హత్యాయత్నం కేసు: ఎస్సీ జగదీష్
సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్‌పై ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీంచిన ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులున్నాయన్నారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు.


