సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే వెల్లడి
నాగ్‌పూర్: ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నాగ్‌పూర్‌లో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించగా, ‘మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీకి దిగడం సబబా?’అని పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన ఐదారుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని దీప్కే డిమాండ్ చేశారు. ‘మోదీజీ ప్రపంచంలోనే ఏం జరిగినా ట్వీట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాత్రం పట్టించుకోరు. కనీసం సంతాప సందేశం కూడా ట్వీట్ చేయరు. మన్‌కీ బాత్, పరీక్షా పే చర్చ ఇంకా ఎన్ని రోజులు..? కనీసం విద్యార్థుల మన్‌కీబాత్ వినిపించుకోండి’అంటూ దీప్కే తీవ్రంగా స్పందించారు. సోమవారం జైపూర్‌లో నిరసన సందర్భంగా తనపై జరిగిన దాడిపై దీప్కే స్పందిస్తూ.. ‘ఈ ఘటన వెనుక ఆర్‌ఎస్‌ఎస్ నేతల హస్తముందని’ దిప్కే పేర్కొన్నారు.


