అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు! | A Birthday Tribute To Vijay, Why Vijay Is Called A Silent Tsunami In Politics And Cinema, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

Jun 22 2026 9:18 AM | Updated on Jun 22 2026 10:43 AM

A Birthday Tribute to Vijay: The Star Who Rose in Silence

రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్‌. వెండితెరపై స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్‌ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. 

తమిళ సినీ దర్శకుడు ఎస్‌.ఏ. చంద్రశేఖర్‌, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్‌, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్‌కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్‌ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్‌ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన విజయ్‌.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్‌ మెటీరియల్‌ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్‌ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.

కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్‌డమ్‌ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.

తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్‌డమ్‌ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.

విజయ్‌ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్‌’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.

అందుకే విజయ్‌ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...

“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్‌ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement