● ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల విషయంలో అధికారులు కేవలం నివేదికలు సమర్పించడమే కాకుండా, అర్జీదారులను వ్యక్తిగతంగా కలసి సమస్యను వివరించి పరిష్కరించే విధంగా వ్యవహరించాలన్నారు. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ పరిధిలో ఇనాం భూమిని పట్టా భూమిగా మార్చి అర్జీదారుడి సమస్యను పరిష్కరించడం ప్రశంసనీయమన్నారు. మరోవైపు జూపాడుబంగ్లా మండలంలో ఒక అర్జీకి సంబంధించి తప్పు సమాచారం అందించిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్‌లో మొత్తం 193 అర్జీలు స్వీకరించామని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


