శ్రీశైలం టెంపుల్: గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు రాతి నిర్మాణంతో సాలు మండపాలు నిర్మించాలనే ప్రతిపాదన వివాదాస్పదమైంది. దేవస్థాన ఈఓ ఆదేశాలతో రూ.19కోట్లతో సాలు మండపాలు నిర్మించాలని ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండా అంశంగా ఉంచగా తిరస్కరించారు. దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో మరోసారి ఇదే అంశాన్ని అజెండాగా ఈఓ చేర్చడంతో రెండో సారి కూడా ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు.
కమిషనర్ విచక్షణాధికారాలతో టెండర్
తాను చెప్పిన విషయం ఈఓతో కావడం లేదని దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నేరుగా రంగంలోకి దిగారు. శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడికి ఫోన్‌చేసి సాలు మండపాల అజెండాను అమోదించాలని ఒత్తిడి చేశారు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో ధర్మకర్తల తీర్మానాన్ని సైతం లెక్కచేయకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ ధర్మదాయ యాక్ట్ 30/1987 ప్రకారం కమిషనర్ విచక్షణాధికారాలతో ఉత్తర్వులు పంపారు. శ్రీశైల దేవస్థాన ఈఓ సుమారు రూ.19కోట్లతో సాలు మండపాల నిర్మాణానికి టెండర్ పిలిచారు. టెండర్‌కు మంగళవారం చివరి తేది.
సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ
దేవదాయ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డు ఎందుకని సీఎం చంద్రబాబుకు ధర్మకర్తల మండి చైర్మన్ బహిరంగలేఖ రాశారు. నూతన క్యూకాంప్లెక్స్, భక్తుల సౌకర్యాల కాంప్లెక్స్, టాయిలెట్స్ మొదట నిర్మించాలని, ఆ తర్వాత సాలు మండపాలను నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. మల్లన్న సొమ్మును వృథా చేయకూడదనే ఉద్దేశంతో సాలు మండపాలను తిరస్కరించామని లేఖలో పేర్కొన్నారు. సాలు మండపాల నిర్మాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలన్నారు. తెలంగాణకు చెందిన పది మంది అర్చకులు శ్రీశైల దేవస్థానంలోనే విధులు నిర్వహిస్తున్నారని, వారిని తిరిగి తెలంగాణకు పంపాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలోని 10 మందిని ఉద్యోగులగా తిరిగి నియమించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ విమర్శలు..
సాలు మండపాల నిర్మాణంపై దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావుకు ఉన్న అసక్తి ఏంటనే విషయాలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సాలు మండపాల నిర్మాణ కాంట్రాక్టర్‌తో ముందే బేరం కుదర్చుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆమ్యామ్యాలు పుచ్చుకుని అతనికే కాంట్రాక్ట్ వచ్చేలా, సదరు కాంట్రాక్టర్‌కు ఉన్న అర్హతలతో టెండర్ నిబంధనలు సైతం మార్పులు చేసినట్లు సమాచారం. సదరు కాంట్రాక్టర్‌తో కుదిరిన ఒప్పందంతోనే ఒకసారి ధర్మకర్తల మండలి ఒకసారి తిరస్కరిస్తే, రెండోసారి కూడా అజెండా అంశంగా చేర్చారనే విమర్శలు ఉన్నాయి. కాగా.. కమిషనర్ రామచంద్రమోహన్‌ను సమర్దిస్తారా లేదంటే చైర్మన్‌ను గౌరవిస్తారా.. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
రూ.19 కోట్లతో సాలు మండపాలు
నిర్మించాలని ప్రతిపాదన
రెండుసార్లు తిరస్కరించిన
ధర్మకర్తల మండలి
సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ
రాసిన చైర్మన్
టెండర్ల నిర్వహణపై కమిషనర్,
ఈఓ ఆసక్తిపై విమర్శలు


