● తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద 30 గ్రామాల ప్రజల నిరసన
కర్నూలు(సెంట్రల్): పక్కనే హంద్రీ ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కులు తాగునీటి కోసం విడుదల చేయాలని 30 గ్రామాల ప్రజలు నినదించారు. కల్లూరు, కోడుమూరు మండలాల్లోని వందలాది ప్రజలు తమ గోడు అధికారులకు వినిపించేందుకు సోమవారం ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు హంద్రీ పరీవాహక పరిరక్షణ కమిటీ కన్వీనర్ శ్రీనివాసగౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్‌లోని దూసుకెళ్లారు. అయితే వారిని పీజీఆర్‌ఎస్ వేదిక వైపు వెళ్లకుండా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. అయితే చివరికి బాధిత గ్రామాలకు చెందిన 5 మందిని అధికారులతో కల్పించేందుకు అధికారులు అంగీకరించడంతో ధర్నాను విరమించారు. నిరసనకు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్, ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు రత్నం ఏసేపు, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.


