● మూత దిశగా
పులిమద్ది ప్రాథమిక పాఠశాల
నంద్యాల(అర్బన్): నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఇలాకాలో మరో ప్రభుత్వ పాఠశాల మూత పడనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసింది. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా అనేక చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల బాగోగుల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా నంద్యాల మండలంలో బ్రాహ్మణపల్లె, సుబ్బారెడ్డిపాలెం పాఠశాలలు మూతపడ్డాయి. ఇదే కోవలో పులిమద్ది గ్రామ మండల ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాల చేరనుంది.
ఇది సంగతి..
పులిమద్ది గ్రామంలోని మండల ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో 2024–25 విద్యాసంవత్సరంలో 14 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది 13 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు పాఠశాల హెచ్‌ఎం కృష్ణారావు సెలవులపై వెళ్లడంతో అదే గ్రామంలో ఉన్న మోడల్ ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌జీటీగా పని చేస్తున్న విజయభాస్కరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈనెల 2న 14 మంది విద్యార్థుల్లో నిహారిక అనే విద్యార్థికి మాత్రమే హాజరు వేశారు. రికార్డుల్లో ఉన్న 13మంది గైర్హాజరు వేశారు. సెలవుల్లో ఉన్న రెగ్యులర్ హెచ్‌ఎం కృష్ణారావు హాజరు శాతాన్ని విచారించకుండా మిడ్డేమిల్స్ యాప్‌లో 14మంది హాజరైనట్లు నమోదు చేశారు. ఈ విషయం ఎంఈఓ బ్రహ్మంనాయక్ దృష్టికి వెళ్లడంతో ఈనెల 3న పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు కృష్ణారావు, డిప్యూటేషన్‌పై వచ్చిన విజయభాస్కరరెడ్డిలను సస్పెండ్ చేశారు. అనంతరం మిట్నాల ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయుడు అరవింద్‌కుమార్‌ను డిప్యూటేషన్‌పై నియమించారు. విద్యార్థులు ఎవరూ లేకపోయినా ఆయన ఈనెల 6 నుంచి పాఠశాలకు వస్తూ వెళ్తున్నారు. విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయకుండా తమ ఊరిలో పాఠశాలను మూసి వేస్తారేమోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


