మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్ర దీపార్చన సేవ | - | Sakshi
Sakshi News home page

మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్ర దీపార్చన సేవ

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

హొళగుంద సెక్షన్‌ దాటిన ఎల్లెల్సీ నీరు

శ్రీశైలంటెంపుల్‌: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామికి సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై అధిష్టింపజేసి ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

రీజియన్‌ హోంగార్డ్స్‌

కమాండెంట్‌గా హనుమంతు

బొమ్మలసత్రం: రాయలసీమ రీజియన్‌ హోంగార్డ్స్‌ కమాండెంట్‌గా హనుమంతు సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హోంగార్డ్స్‌ దర్బార్‌లో సిబ్బంది ఆరోగ్యం, ప్రమాద బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించామన్నారు. పోలీస్‌ వ్యవస్థలో హోమ్‌గార్డుల పాత్ర కీలకమైందన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు

157 ఫిర్యాదులు

బొమ్మలసత్రం: పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి 157 ఫిర్యాదులు అందాయి. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ సూచించారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇరుపక్షాలతో మాట్లాడి భాధితులకు న్యాయం చేయాలన్నారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజీలో గత 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం కర్నూలు మెడికల్‌ కాలేజీలో నిర్వహించారు. ఏడీ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలోని కాన్ఫరెన్స్‌ హాలులో అభ్యర్థులను పిలిచి వారి సర్టిఫికెట్లు పరిశీలించారు. మొత్తం 8 పోస్టులకు అభ్యర్థులను పిలవగా ఆర్థోపెడిక్‌ టెక్నీషియన్‌, ఈఈజీ టెక్నీషియన్‌, మోల్డ్‌ టెక్నీషియన్‌, ప్రోస్టేటిస్ట్‌, ప్రోస్టోటిక్‌ టెక్నీషియన్‌ పోస్టులకు మాత్రం అభ్యర్థులు రావడంతో వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలించి పంపించారు. మిగిలిన పోస్టులకు, అభ్యర్థులకు మంగళవారం(21వతేది) కూడా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.

క్వింటా వేరుశనగ రూ.7,970

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.7,970 పలికింది. మార్కెట్‌కు 754 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.3,369, మధ్యస్థ ధర రూ.7,120 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.

హొళగుంద: తుంగభద్ర జలాశయం నుంచి ఈ నెల 16న దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు విడుదల చేసిన నీరు సోమవారం మధ్యాహ్నానికి హొళగుంద సెక్షన్‌ 184 కి.మీ దాటి ముందుకెళ్లాయి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి బళ్లారి, రాయచూరు, కర్నూలు తదితర ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం డ్యాం నుంచి రోజుకు 3,500 క్యూసెక్కుల(ఎల్‌బీఎంసీ, పవర్‌ కెనాల్‌ కాలువలకు) నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలాఉంటే టీబీ డ్యాంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో ఖరీఫ్‌కు సాగునీటిని విడుదల చేయకుండా తాగునీటి వరకే పరిమితం చేశారు. ప్రస్తుతం డ్యాంలో 26 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది 33 పాత క్రస్టుగేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు ఒక పంట (ఖరీఫ్‌)కు మాత్రమే నీరిచ్చి రబీకి చేతులెత్తేశారు. ఈ సారి ఖరీఫ్‌కు కూడా నీరందే పరిస్థితి లేకపోవడంతో ఆయా రాష్ట్రాల రైతులు దిక్కతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం ఎల్లెల్సీకి 1100 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement