● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గకుండా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నివేదికలు సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా, ప్రణాళిక, బ్యాంకింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక నీటి అవసరం ఉన్న వరి, మొక్కజొన్న వంటి పంటల సాగుపై సమీక్షించాలాన్నరు. తక్కువ నీటితో సాగయ్యే మినుములు, కందులు, శనగలు వంటి పప్పుధాన్యాలను ప్రోత్సహించాలన్నారు. బహుళ పంటల సాగు, నీటి పొదుపుపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పంటలపై ప్రభావం పడితే పశుగ్రాసం కొరత ఏర్పడి పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశముందని దీనిపై పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో నీటి ఎద్దడి ఎదురయ్యే గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భూమిని ఏడాది పొడవునా సాగులో ఉంచే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు రుణాల పునర్వ్యవస్థీకరణ, పంటల బీమా, నష్టపరిహారం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు.


