వరిపై ఎల్‌నినో పడగ
వర్షాలు లేక సాగునీటి ప్రాజెక్టులు వెలవెల
జిల్లాలో ఖరీఫ్‌లో 72,201 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం
నారుమడులను సిద్ధం చేసుకుంటున్న రైతన్న
ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు ప్రశ్నార్థకమే
మాయలూరు సమీపంలో వరినారుమడి
సాగునీటి ప్రాజెక్టులు వెలవెల..
కోవెలకుంట్ల: వరి సాగుకు జిల్లా ప్రసిద్ధి. సమృద్ధిగా నీటి వనరులు ఉండటంతో రెండు పంటలు వరి సాగుకు అనుకూలంగా మారింది. అయితే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌లో జిల్లాలోని 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా 72,201 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల, షుగర్‌లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అంతంత మాత్రమే వర్షాలు కురవడంతో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. దేవుడిపై భారం వేసి కుందూనది, వాగులు, బోర్ల కింద నారు మడులు సిద్ధం చేశారు. కాగా ఆయకట్టుకు నీటి విడుదలపై నీలినీడలు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాట్లు వేసి పంటలను ఎలా కాపాడుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. జిల్లాలో రెండేళ్ల నుంచి వరిసాగు రైతులకు కలిసి రావడం లేదు. వాతావరణం అనుకూలించక ప్రకృతి వైపరీత్యాలతో వరి రైతులు కుదేలయ్యారు. గతేడాది అక్టోబర్ నెలలో పైరు పొట్ట దశకు చేరుకుంది. ఆ నెలలో తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు వరి చాలా చోట్ల నేలవాలి వడ్లు రాలిపోయాయి. పొట్టదశ కావడంతో గింజంతా రాలిపోయింది. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగబడులు వస్తాయనుకుంటే భారీ వర్షాలు దెబ్బతీయడంతో ఎకరాకు 30 బస్తాలకు మించి రాకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. వేలాది రూపాయాలు పెట్టుబడులు వెచ్చించగా పంట చేతికందే తరుణంలో తరుణుడు కొంపముంచాడు. దిగుబడులు తగ్గగా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రైతులను వేధించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా 2,200 వరకు ధర పలికింది. గత ఏడాది మార్కెట్‌లో బస్తా రూ. 1,400 మించి లేకపోవడంతో ఈ ధరకే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి జిల్లా రైతాంగాన్ని సాగునీటి గండం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఎస్సార్బీసీ, కేసీకెనాల్, రిజర్వాయర్లు, చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. గత ఏడాది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో జూలై నాటికే శ్రీశైలం జలాశయాన్ని సాగునీరు పుష్కలంగా చేరింది. ఈ ఏడాది రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో శ్రీశైలం జలాశయంలో నీరు అంతంత మాత్రంగానే ఉండటంతో ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, తదితర ప్రాజెక్టులకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది. కుందూనది, బోర్ల నీటి ఆధారంగా రైతులు ఆయా ప్రాంతాల్లో నారుమడులు పోసి వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది రైతులు కర్నూలు, నంద్యాల సోనాపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో ఈ ఏడాది వరికి గిట్టుబాటు ధర ఉండటంతో రైతులు వరిసాగుపై దృష్టి సారించారు. ఈ నెలాఖరు నుంచి వరినాట్లు వేసేందుకు వరిమడులను సిద్ధం చేసుకుంటున్నారు.
ఖరీఫ్‌లో వరిసాగు లక్ష్యం..


