● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రీ–సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా వేగవంతంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ల్యాండ్ అండ్ సర్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి రీ–సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవల పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. రీ–సర్వే ప్రక్రియలో రైతులకు అవసరమైన సర్టిఫికెట్లు తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్ల ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేవల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి అర్హులైన రైతులందరికీ సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.


