పంటలు ఎండి.. గుండెలు మండి | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండి.. గుండెలు మండి

Jul 22 2026 1:59 AM | Updated on Jul 22 2026 1:59 AM

కనిపించని వరుణుడి జాడ

మొక్కజొన్న పంటను తొలగిస్తున్న రైతులు

పెట్టుబడి అంతా మట్టి పాలు

20 ఎకరాల్లో పంట నష్టం

పది ఎకరాల్లో ధ్వంసం చేశాను

ఆత్మకూరు: ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయి. వరుణుడు మొహం చాటేయడంతో పంటలపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. విత్తు వేసిన చేతులతోనే పంటలను దున్నేస్తున్నారు. కొన్ని చోట్ల పశువులు, జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. ఆత్మకూరు మండల పరిధిలోని బాపునంతపురం, కరివేన, నల్లకాల్వ, కొత్త రామాపురం, ముష్టేపల్లి, సిద్దపల్లి తదితర గ్రామాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1,400 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. రెండు నెలలుగా ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో ఓ మోస్తరు వర్షం కూడా కురవలేదు. పంట పెరిగే దశలో వానలు కురవకపోవడంతో పంట పూర్తిగా వాడుపడుతున్నాయి. రైతులు చేసేదేమి లేక పంటలను దున్నేస్తున్నారు. ఇదే తరహాలో కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు మండలాల్లో కూడా మొక్కజొన్న పంట వందలాది ఎకరాల్లో రైతులు తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు వెచ్చించిన రూ.30 వేల నుంచి రూ.40 వేలు మట్టిలో కలిసిపోయాయి. ఎంతో ఆశతో పంటను కాపాడుకునేందుకు ముందుగానే తెచ్చి పెట్టుకున్న క్రిమిసంహారక మందులు విత్తన దుకాణాల్లో తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆత్మకూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణంలో 30 శాతం సాగు చేసిన పంటలన్నీ ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వానల్లేక నేను సాగు చేసిన 20 ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువుల కోసం దాదా పు రూ.7 లక్షలు పెట్టాను. పంట పెరిగే సమయంలో ఒక్క వాన కూడా కురవలేదు. చివరకు పంటను తొలగించాల్సి వచ్చింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – రవీంద్రయాదవ్‌, కరివేన రైతు

ఎంతో ఆనందంగా 10 ఎక రాల్లో మొక్కజొన్న విత్తనాలు వేశాం. వర్షాలు అడపాదడపా పంటలు ఏపుగా పెరిగి పంటలు వస్తాయని భావించాను. వర్షాలు లేకపోవడంతో కళ్ల ముందే మొక్కలు ఎండిపోవడంతో దున్నేశా ను.మధ్యకార పంట సాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. – శ్రీనివాసులు, బాపునంతపురం రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement