సంజామల: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం సంజామల కేజీబీవి కళాశాల, మె యిన్ స్కూల్ పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనీఖీ చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా.. లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న స్కూల్ బ్యాగ్‌లు, దుస్తులు తదితర వస్తువులు తప్పని సరిగా విద్యార్థులకు చేరాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ రమణా రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీలేఖ ఉన్నారు.
ఆధునిక సాంకేతికతతో నేరగాళ్లను అడ్డుకోవాలి
బొమ్మలసత్రం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్‌శాఖ సమర్ధవంతంగా వినియోగించుకుని నేరగాళ్ల ఆటకట్టించాలని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో అడినషల్ ఎస్పీ ఆధ్వర్యంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్‌పై సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీస్‌శాఖలో పనిచేసే సిబ్బందికి సేవల నాణ్యత పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించటం వల్ల నేరాల కట్టడికి కృషి చేయవచ్చని వివరించారు. దీనిద్వారా ప్రజలకు కేసుల విషయంలో వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ మల్లికార్జున గుప్తా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల మహాసమ్మేళనానికి సన్నాహాలు
నంద్యాల(వ్యవసాయం): స్థానిక రామకృష్ణ విద్యాలయంలో విద్యనభ్యసించిన అన్ని బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ‘పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం – 2026 నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శివకుమారరెడ్డి, రవిప్రకాష్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహా సమ్మేళనాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన (ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా) నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థులు తమ బాల్య జ్ఞాపకాలను పంచుకోవడం, స్నేహబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. పూర్తి వివరాల నమోదు కోసం శివకుమార్ రెడ్డి (94408 78658), రవి ప్రకాష్ 98661 44759ను సంప్రదించాలన్నారు.
ఎస్సీలకు పలు కేంద్ర పథకాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని ఎస్సీలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పలు పథకాలను అమలు చేస్తున్నట్లు ఈడీ కె.తులసీదేవి తెలిపారు. పీఎంఈజీపీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ, నేచురల్ ఫార్మింగ్, కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు, డ్రోన్స్ హార్టికల్చర్ తదితర పథకాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోందన్నారు. వివరాలు తెలుసుకునేందుకు, లబ్ధి పొందేందుకు htt ps://apsccorporation.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని ఆమె కోరారు.


