● పేదల స్థలాలను ఆక్రమించేందుకు రాజకీయం చేస్తున్నారు ● దొరకొట్టాల్లో టీడీసీ నేతలు కబ్జా చేసిన స్థలంలో దళితుల నిరసన
ఆళ్లగడ్డ: మేమంతా కూలీ నాలీ చేసుకుని బతుకుదెరువు కొనసాగించేవారం.. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని దొరకొట్టాలకు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దొరకొట్టాల గ్రామంలోని సుమారు 40 కుటుంబాలకు చెందిన దళితులు టీడీపీ నేతలు కబ్జా చేసిన స్థలంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 70 సంవత్సరాల క్రితం దళితుల నివాస స్థలాలకోసం 367 సర్వే నబంరులో రెండెకరాలు కేటాయించి గ్రామ కంఠంగా మార్పు చేశారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలుగా విభజించి అంతర్గత రోడ్లు కూడా వేయించారన్నారు. ఇప్పుడు ఆ స్థలం సుమారు రూ. 6 కోట్లు పలుకుతుందని భావించిన టీడీపీ నేతలు ఎలాగైనా స్థలాన్ని ఆక్రమించుకుని అమ్ముకోవాలని భావించి జేసీబీతో అంతర్గత రోడ్లు, కంచెలు ధ్వంసం చేశారన్నారు. అడ్డుకోబోయిన తమపై దౌర్జన్యం చేసి భయబ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న తమ స్థలాలను టీడీపీ నాయకుడు కబ్జా చేసి, మళ్లీ వాళ్లే దళితుడిని తన స్థలంలోకి పోకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అతను దళితుడు అంటే, 40 కుటుంబాలకు చెందిన తాము దళితులం కాదా? అని ప్రశ్నించారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకుడు పేద దళితుల స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని, అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.


