శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
కొత్తూరులో గుంటూరు జిల్లా జడ్జి పూజలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం గుంటూరు జిల్లా జడ్జి కోళ్లపూడి కిషోర్ పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జడ్జి స్వామికి అభిషేకాలు, అర్చనలు, తదితర విశిష్ట పూజలు చేశారు. తర్వాత అర్చకులు జడ్జికి శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు.
హొళగుంద: మండలకేంద్రం హొళగుందలోని జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న చెరువు వద్ద కురువల ఆరాధ్య దైవం భక్త కనకదాసు నూతన విగ్రహ, కలశ ప్రతి ష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. దమ్మూరు గోవర్ధననందపురి స్వామి, మదిరే యల్లా లింగామఠం నాగరాజు స్వామి చేతుల మీదుగా సాగిన ఈ కార్యక్రమాని తిలకించేందుకు కురువలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, టీడీపీ ఆలూరు ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కనకదాసు విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ జాతి పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న అజ్ఞానాన్ని తన కీర్తనలు, పాటలతో తొలగించిన మహనీయుడు భక్త కనకదాసు అని కొనియాడారు. విగ్రహ ప్రతిష్ఠోత్సవంలో భాగంగా గ్రామంలో గజ్జెళ్లి చిన్నారుల కోలాటం, భజన బృందం మధ్య కనకదాసు చిత్రపట ఊరేగింపు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. కురువ సంఘం జిల్లా అసోషియేషన్ అధ్యక్షుడు ఎల్లార్తి దర్గన్న, కుల పెద్దలు డీసీ బజ్జన్న, శేషన్న, ఎం.డీ హళ్లి నాగరాజు, నందీశ, శేషగిరి, గర్జప్ప, చాగప్ప, లింగన్న, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలి శవం లభ్యం
హొళగుంద: స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆదివారం స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో హెడ్ కానిస్టేబుల్ రామ్‌నాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాడు. మృతురాలికి 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. అనారోగ్య సమస్యలతో చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిస్తే హొళగుంద ఎస్‌ఐ 91211 01161కు సమాచారం ఇవ్వాలని కోరారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో నాపరాళ్ల ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే సుధాకర్ (40) సొంతూరు బనగానపల్లె మండలం కై ప గ్రామం. వారం క్రితం అతని భార్య, పిల్లలు పని మీద కై పకు వెళ్లారు. అతను మిద్దైపె నిద్రించగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఫోన్ వినియోగించక పోవడంతో పాటు ఎప్పుడైనా పనులకు వెళ్తే నాలుగైదు రోజులకు ఇంటికి తిరిగొచ్చేవాడు. ఈ క్రమంలో అతని గురించి కుటుంబీకులు వాకబు చేయలేదు. అయితే ఆదివారం చుట్టు పక్కల ఇళ్ల వారికి సుధాకర్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పరిశీలించగా.. మిద్దైపె శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య లీలావతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని తండ్రి కైప రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


