మూసీ గేట్ల మరమ్మతుకు ముందడుగు | - | Sakshi
Sakshi News home page

మూసీ గేట్ల మరమ్మతుకు ముందడుగు

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

రిజర్వాయర్‌లో నీటి తగ్గింపునకు అనుమతి

యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే ప్రకటించే అవకాశం

కేతేపల్లి : మూసీ రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని 610 అడుగులకు తగ్గించేందుకు అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రాజెక్టు గేట్లతో పాటు, కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేసే తూముల గేట్ల నుంచి లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతోంది. గేట్లకు మరమ్మతు చేపట్టాలంటే రిజర్వాయర్‌లో నీటిమట్టం 610 అడుగుల(గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) డెడ్‌ స్టోరేజీకి పడిపోతేనే వీలవుతుంది. కానీ, 8 ఏళ్లుగా మూసీ ప్రాజెక్టు వేసవిలోనే నిండుతుండటంతో అధికారులు ఆయకట్టులో రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్నారు. యాసంగి పంటకాలం ముగిసిన తర్వాత కూడా రిజర్వాయర్‌లో నీటిమట్టం 625 అడుగులకు పైగానే ఉంటోంది. దీంతో గేట్ల మరమ్మతుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తే రైతుల నుంచి అభ్యంతరాలు వస్తుండడంతో గేట్ల మరమ్మతు చేపట్టలేదు. ఈ క్రమంలో రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని తగ్గించేందుకు అనుమతులు కోరుతూ మూసీ ప్రాజెక్టు అధికారులు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. అనుమతుల మంజూరులో జాప్యం కావడం.. ప్రాజెక్టు నీటిమట్టం జూన్‌లోనే 640 అడుగులకు చేరటంతో ఆయకట్టులో పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని 610 అడుగులకు తగ్గించి గేట్లకు మరమ్మత్తులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ నుంచి చీఫ్‌ ఇంజనీర్‌కు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వానాకాలం సీజన్‌ ముగిశాక పనులు

ఆయకట్టులో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్న ఈ తరుణంలో డ్యాం గేట్లను ఎత్తి నీటిని వృథాగా దిగువకు పంపితే రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉన్నందున వానాకాలం సీజన్‌ పంట ముగిసిన తర్వాత రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని 610 అడుగులకు తగ్గిస్తామని మూసీ డ్యాం ఇంజనీర్లు తెలిపారు. యాసంగి సీజన్‌ ప్రారంభం నాటికి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు చేరినా మూసీ ఆయకట్టులో యాసంగి పంటకు క్రాప్‌ హాలిడే ప్రకటించి గేట్లకు మరమ్మతు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు, రైతులు అభ్రిప్రాయ పడుతున్నారు.

మూసీ రిజర్వాయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement