మార్కెట్‌ ధర రూ.కోటి.. ఇచ్చేది రూ.8.50 లక్షలే! | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ధర రూ.కోటి.. ఇచ్చేది రూ.8.50 లక్షలే!

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

మరోచోట భూమి ఇవ్వండి

నాకు వట్టిమర్తి గ్రామంలో ఎకరం 25 గుంటల భూమి ఉంది. ఎంతో ఖర్చు పెట్టి బోరు వేస్తే నీళ్లు పడ్డాయి. ఇప్పుడు కాల్వ నిర్మాణంలో నాకున్న 17.5 గుంటల భూమితో పాటు బోరు కూడా పోతోంది. మిగిలిన భూమి కూడా కాల్వ వల్ల రెండు ముక్కలై సాగుకు పనికిరాకుండా పోతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు తక్కువ పరిహారం ఇస్తామంటున్నారు. మాకు కోల్పోయిన భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలి, లేదంటే మార్కెట్‌ ధర ప్రకారం న్యాయం చేయాలి.

– చింతపల్లి కృష్ణయ్య, బాధితుడు, వట్టిమర్తి

చిట్యాల : ఉదయ సముద్రం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ నిర్మాణం కోసం అది చిట్యాల మండలం వట్టిమర్తి రైతులు తమ భూములను త్యాగం చేయాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం మొదలైన ఈ భూసేకరణ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు. ప్రాజెక్టు ఆలస్యమవ్వడం, భూములకు సరైన పరిహారం దక్కకపోవడంతో రైతులు దశాబ్ద కాలంగా ఆందోళన బాటలోనే ఉన్నారు. గతేడాది జూన్‌ నుంచి నవంబర్‌ వరకు జరిగిన సర్వేలు, గ్రామసభలను రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయమైన పరి హారం ఇస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు.

33.4 ఎకరాలు అవసరం

గ్రామం మీదుగా వెళ్లే కాల్వ నిర్మాణం కోసం 262 మంది రైతులకు చెందిన సుమారు 33.4 ఎకరాల భూములను సేకరించేందుకు అధికారులు పదేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాగా ఈ భూముల సేకరణకు వచ్చిన అధికారులకు భూములు కోల్పోతున్న రైతులు అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. పలు కారణాల చేత ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడంతో భూసేకరణ వాయిదా పడుతూ వచ్చింది. కాగా 2025 జూన్‌ 14వ తేదీన భూముల సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. 2025 సెప్టెంబర్‌ 19, అక్టోబర్‌ 6న భూసేకరణకుగాను అధికారులు నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. 2025 నవంబర్‌ 04వ తేదీన గ్రామంలో గ్రామసభను నిర్వహించి రైతుల ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు.

ప్రస్తుతం భూమి విలువ రూ.5.40 లక్షలు

వట్టిమర్తి పరిధిలోని భూములకు బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు కోటి రూపాయలకు పైగా ధర పలుకుతోంది. కానీ, పదేళ్ల క్రితం నాటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇక్కడ ఎకరా విలువ రూ.2.80 లక్షలు మాత్రమే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం దానికి మూడు రెట్లు కలిపి.. ఎకరాకు కేవలం రూ. 8.50 లక్షలు మాత్రమే ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్‌లో కోటి రూపాయల విలువైన భూమికి కేవలం ఎనిమిదిన్నర లక్షలు ఇస్తే తాము ఎలా బతకాలి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ భూముల విలువను రూ.5.40 లక్షలకు పెంచినప్పటికీ, పాత నోటిఫికేషన్‌ ధర ప్రకారమే పరిహారం ఇస్తామని అధికారులు అనడంపై చిన్న, సన్నకారు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రాజెక్టు పనులపై నేడు కలెక్టరేట్‌లో సమీక్ష

ఈ నెల 15న డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21న నల్లగొండ కలెక్టరేట్‌లో ప్రాజెక్టు పనులపై జరగనున్న ఉన్నత స్థాయి సమీక్షలో ఈ పరిహారంపై అధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం అందించి ఆదుకోవాలని వట్టిమర్తి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ ఉదయ సముద్రం లిఫ్ట్‌ కాల్వకు భూములిచ్చే రైతులకు దక్కని న్యాయమైన పరిహారం

ఫ పదేళ్ల నాటి భూ విలువ ప్రకారమే ఇస్తామంటున్న ప్రభుత్వం

ఫ మార్కెట్‌ ధర చెల్లిస్తేనే భూములిస్తామంటున్న వట్టిమర్తి రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement