మర్రిగూడ : పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు మర్రిగూడ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కాగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ముప్పును నివారించేందుకు ఎంఈఓ జి.శారద అనుమతితో రిసోర్స్ పర్సన్ ఉదావత్ లచ్చిరాం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రాజాపేటతండా సర్పంచ్ కొడాల వెంకట్‌రెడ్డి కాంప్లెక్స్‌కు అవసరమైన 50 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిళ్లను విరాళంగా అందించారు. దీంతో శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరు స్టీల్ ప్లేట్లలో భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జటావత్ రూప్‌సింగ్, లచ్చిరాం, వెంకటేశ్వర్లు, రజనీకాంత్, నాగేంద్ర, బాలరాజు, శ్రీశైలం, వెంకటయ్య, ఉపేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


