న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండడం, ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వ్యవసాయశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రైతులు ఈ వానాకాలం సాగు విధానాన్ని మార్చుకుంటున్నారు. గతంలో ప్రధానంగా వరిపైనే ఆధారపడిన రైతులు ఈసారి ఆరుతడి పంటలు, ముఖ్యంగా కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఇప్పటికే వర్షాధారంగా సాగు చేసే పత్తి విస్తీర్ణం అనేక మండలాల్లో పెరిగింది. నీటి లభ్యతపై స్పష్టత వచ్చే వరకు వరి నాట్లను వాయిదా వేస్తూ ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులు చేసిన సేద్యాన్ని పరిశీలిస్తే వరి సాగు అంచనాలు గణనీయంగా తగ్గగా, పత్తి సాగు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతోంది.
వరి సాగుకు వెనుకడుగు
ఎల్‌నినో ప్రభావంతో రైతులకు వరిసాగుకు వెనకడుగు వేస్తున్నారు. కనగల్ మండలంలో ప్రతి ఏటా 40 వేల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఈసారి అది 20 వేల ఎకరాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నల్లగొండ మండలంలో గత ఏడాది 39 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 30 వేల ఎకరాలకు తగ్గే పరిస్థితి ఉంది. మిర్యాలగూడ, త్రిపురారం మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. నల్లగొండ, చింతపల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, నిడమనూరు, అనుముల, పెద్దవూర, తిరుమలగిరి, డిండి, వేములపల్లి, చిట్యాల తదితర మండలాల్లో కంది సాగు పెరుగుతోంది. అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడుగులపల్లి తదితర మండలాల్లో పెసర సాగు కూడా ప్రారంభమైంది.
ఆయిల్‌పామ్ తోటల విస్తరణ
వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ బత్తాయి, నిమ్మ, మామిడి, ఆయిల్‌పామ్ తోటల విస్తీర్ణం జిల్లాలో స్థిరంగా కొనసాగుతోంది. అనుములలో సుమారు 5 వేల ఎకరాలు, పెద్దవూరలో 7,752 ఎకరాలు, నిడమనూరులో 3,800 ఎకరాలు, తిప్పర్తిలో 900 ఎకరాలు, తిరుమలగిరిలో 725 ఎకరాలు, చిట్యాల, కనగల్, మరికొన్ని మండలాల్లోనూ తోటలు సాగువుతున్నాయి. ఆయిల్‌పామ్ సాగు కూడా అనుముల, పెద్దవూర, తిప్పర్తి, నిడమనూరు తదితర మండలాల్లో విస్తరిస్తోంది.
వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఆరుతడి పంట వేశా. గతేడాది సాగు చేసిన పత్తిలో అంతర పంటగా కంది వేశా. ఇప్పుడు ఒక ఎకరం మొత్తంలో కంది సాగు చేశా. మరో రెండెకరాల్లో వేరుశనగ వేశాను. ఈ పంటలకు పెట్టుబడితో పాటు కూలీల అవసరం తక్కువే.
– పొలం ఈశ్వరయ్య, డిండి
వరిసాగు చేయడానికి నీరు సరిపోవడంలేదు. దీంతో మూడెకరాల్లో దోసకాయ వేశాను. మరో ఆరెకరాల్లో దోస, వంకాయ సాగు చేయడానికి దుక్కి దున్ని సిద్ధం చేస్తున్నా. వర్షాలు లేకపోవడంతో వరిసాగు మానేసి కూరగాయల సాగు ఎంచుకున్నా.
– కట్టా జగన్‌రెడ్డి, సిలార్‌మియాగూడెం, తిప్పర్తి మండలం
నాకున్న 9 ఎకరాల్లో ఏటా వరి సాగు చేసేవాన్ని. వరి వేయాలంటే అధిక నీరు కావాలి. వర్షాభావ పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టాను. తక్కువ నీటి అవసరం ఉంటుందని అధికారులు చెప్పారు.
– కోయగూర అంజిరెడ్డి,
పగిడిమర్రి, కనగల్ మండలం
ఈ ఫొటోలోని రైతు నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన ఉన్నా వెంకటేశ్వర్లు. తనకున్న 8 ఎకరాలతోపాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వరి వేద్దామని దుక్కి దున్నినా వర్షాలు లేకపోవడంతో 15 ఎకరాల్లో కంది చల్లారు. మిగతా 5 ఎకరాల్లో బోర్ల కింద వరి సాగు చేస్తున్నాడు.
ఫ వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటల సాగు
ఫ తగ్గిన వరిసాగు.. పెరుగుతున్న కంది
ఫ పత్తి వైపు రైతుల ఆసక్తి
ఫ ఎల్‌నినో ప్రభావంతో సాగు విధానాన్ని మార్చుకుంటున్న రైతులు


