నకిరేకల్ : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే వేముల వీరేశంను మార్చిలో ప్రభుత్వ విప్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ జీఓ ఆర్టీ నంబర్ 1064 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు ప్రభుత్వ విప్ పదవీకాలం ముగిసే వరకు రాష్ట్ర మంత్రులకు కల్పించే ప్రొటోకాల్ నిబంధనలు వర్తించనున్నాయి. రాష్ట్రంలోని అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, సంబందిత విభాగాలు అవసరమైన ప్రొటోకాల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశించింది.
ఎడమకాల్వ లైనింగ్ పనుల పరిశీలన
నిడమనూరు : సాగర్ ఎడమకాల్వ సీసీ లైనింగ్ పనులను క్వాలిటీ కంట్రోల్, ఎన్‌ఎస్పీ అధికారులు మంగళవారం పరిశీలించారు. ప్రధాన కాల్వ 37.5 కిలోమీటరు వద్ద సీసీ పనుల నాణ్యతను పరిశీలించారు. సీసీ పనుల్లో రెండు రకాల కంకర, రాక్ సాండ్, ఫ్‌లై యాష్ వాడుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాక్‌సాండ్, ఇసుక 4:3 నిష్పత్తిలో వాడుతున్నట్లు అధికారులకు వివరించారు. ఇసుక వాడకం పెరగాలని అధికారులకు సూచించారు. క్యూరింగ్‌పై శాంపిళ్లు సేకరించారు. పరిశీలనలో క్వాలిటీ నియంత్రణ అధికారులతోపాటు డీఈ స్వామి, గోపినాథ్, ఏఈ అశోక్ ఉన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
నకిరేకల్ : నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం–1, కామర్స్–2, జువాలజీ–1, కంప్యూటర్ సైన్స్–1 చొప్పున మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 28న నల్లగొండలోని ఎన్జీ కళాశాలో జరిగే ఇంటర్వ్యూకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
దేశ రాజకీయాలను శాసించేది యువతే..
నల్లగొండ టౌన్ : దేశ రాజకీయాలను శాసించే శక్తి యువతరంలోనే ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం సీసీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ ఉద్యోగ పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు, అన్నమల్ల నవీన్, యషబోయిన మల్లేశం, గడ్డం నవీన్, బండారు శంకర్, జూలూరు వెంకటాచారి, దశరథ, బాబి పాల్గొన్నారు.


