నీలగిరి కార్పొరేషన్‌కమిషనర్‌గా వంశీకృష్ణ | - | Sakshi
Sakshi News home page

నీలగిరి కార్పొరేషన్‌కమిషనర్‌గా వంశీకృష్ణ

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా వంశీకృష్ణను నియమిస్తూ సీడీఎంఏ శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన శరత్‌చంద్ర ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. పోసింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న వంశీకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నగరంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నందున వాటిని సకాలంలో పూర్తి చేయించేందుకు మంత్రి గ్రూప్‌–1 ఆఫీసర్‌ అయిన వంశీకృష్ణను నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

20న మూసీ మత్స్య సంఘం చైర్మన్‌ ఎన్నిక

నకిరేకల్‌ : మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్‌, ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక కోసం ఈనెల 20వ తేదీన ఉదయం 9గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికై న 13 మంది డైరెక్టర్లు హజరు కావాలని ఎన్నికల అధికారి కె.శ్రీరామ్‌ శనివారం నోటీసులు అందించారు.

ఇందు ప్రతిభకు ఐదు బంగారు పతకాలు

రామగిరి(నల్లగొండ) : కృషి, పట్టుదల ఉంటే పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించింది ఆ విద్యార్థిని. ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకున్నా, తన అసాధారణ ప్రతిభతో ఏకంగా ఐదు బంగారు పతకాలను కై వసం చేసుకుని రికార్డు సృష్టించింది. నిడమానూరు మండలం వెంగన్నగూడెం గ్రామానికి చెందిన క్యాస ఇందు నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో బీజెడ్‌సీ కోర్సు పూర్తి చేసింది. ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్న ఇందు, మొదటి నుంచి చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. ఇందు తన కోర్సులో భాగంగా జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, ఇంగ్లిష్‌లో బంగారు పతకం సాధించింది. లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో ఓవరాల్‌ టాపర్‌గా నిలిచి ఐదో బంగారు పతకం సాధించింది. ఈ నెల జూలై 22న నిర్వహించనున్న కళాశాల స్నాతకోత్సవలో ఆమె ఈ ఐదు పతకాలను అందుకోనుంది. ఒకేసారి ఐదు బంగారు పతకాలు సాధించి, గ్రామానికి, కళాశాలకు మంచి పేరు తెచ్చిన ఇందును అధ్యాపకులు, గ్రామస్తులు, తోటి విద్యార్థులు అభినందించారు.

చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టులో గల పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన 59 రోజుల కానుకలను శనివారం మహా మండపంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. హుండీ ద్వారా రూ.56,91,035 ఆదాయం వచ్చిందని, అన్నదానం హుండీకి మరో రూ.31,070 వచ్చిందని ఈఓ మోహన్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సుమతి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ పాల్గొన్నారు.

పెరటి కోళ్ల పెంపకంతో మహిళలకు ఉపాధి

కనగల్‌ : పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్‌ జీవీ.రమేష్‌ అన్నారు. మండలంలోని రామచంద్రపురం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. జనవరి మాసంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసిన కోడి పిల్లలను పరిశీలించారు. పశువులకు వేసిన వివిధ రకాల టీకాల వివరాలను పశువైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి సిహెచ్‌.బాబు, సర్పంచ్‌ అందుగుల సువర్ణ వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement