ఆ హోటల్‌ వద్ద ఆగితే అంతే..! | Vijayawada To Hyderabad highway Hotel Theft Trap | Sakshi
Sakshi News home page

VIJ To NLG Highway: ఆ హోటల్‌ వద్ద ఆగితే అంతే..!

Jul 21 2026 12:48 PM | Updated on Jul 21 2026 12:51 PM

Vijayawada To Hyderabad highway Hotel Theft Trap

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (ఏఐ ఫోటో)

నల్గొండ జిల్లా: విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ దోపిడీ దొంగలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాత్రివేళ హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు టీ, టిఫిన్‌ కోసం ఈ హోటల్‌ వద్ద ఆపుతుంటారు. దీంతో అక్కడే మాటువేస్తున్న దోపిడీ దొంగలు పక్కా స్కెచ్‌తో ప్రయాణికుల సొమ్మును దోచేస్తున్నారు. హైవేపై ఎన్నో హోటళ్లు ఉన్నప్పటికీ.. కేవలం ఈ హోటల్‌ వద్దే పదేపదే దొంగతనాలు జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

నాలుగేళ్లలో నాలుగు.. 
గడిచిన నాలుగేళ్లలో ఆ హోటల్‌ ఆవరణలోనే నాలుగు భారీ చోరీలు జరిగాయి. 2022 నవంబర్‌ 22న విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును హోటల్‌ వద్ద ఆపగా.. ఓ ప్రయాణికుడికి సంబంధంచిన కిలో 300 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. అదేవిధంగా 2023 జూలై 26న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికుడికి చెందిన రూ.28 లక్షల నగదును ఈ హోటల్‌ వద్దే దొంగలు అపహరించారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఇప్పటికీ దొరకలేదు. 2025 ఫిబ్రవరి 9న ఈ హోటల్‌ వద్ద ఆపిన బస్సులో నుంచి రూ.25 లక్షలు చోరీ చేసి కారులో పారిపోతున్న ముఠాను అప్పటి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ సీసీ కెమెరాల ఆధారంగా మధ్యప్రదేశ్‌కు వెళ్లి పట్టుకున్నారు. రికవరీ చేసిన నగదును బాధితుడికి అప్పగించారు. తాజాగా ఆదివారం ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ హోటల్‌ వద్ద ఆగగా.. ఓ ప్రయాణికుడు రూ.9లక్షల నగదు ఉన్న బ్యాగును పక్కన పెట్టుకుని టిఫిన్‌ చేస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా బ్యాగును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో పరారయ్యారు. 

సినిమా ఫక్కీలో చోరీ..
ఈ దోపిడీ ముఠాలు పక్కా ప్రణాళికతోనే సినిమా ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దొంగలు ముందుగానే కారులో వచ్చి హోటల్‌ వద్ద మాటు వేస్తున్నారు. బస్సులు ఆగగానే ప్రయాణికులను గమనిస్తూ, నగదు లేదా నగలు ఉన్న బ్యాగులను టార్గెట్‌ చేస్తున్నారు. తరచూ ఆ హోటల్‌ వద్ద పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలు
వరుస చోరీల నేపథ్యంలో çహోటల్‌ వద్ద పోలీసులు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. తాజాగా జరిగిన దోపిడీపై నార్కట్‌పల్లి సీఐ సిరికొండ సురేష్, ఎస్‌ఐ పందిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీసీఎస్‌ సమన్వయంతో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. హోటల్‌ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, జిల్లా సరిహద్దుల్లోని నాలుగు టోల్‌ ప్లాజాల డేటా, మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement