‘టాక్సిక్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Toxic Movie Review: Yash, Nayanthara Film Telugu Review, Rating & Verdict | Sakshi
Sakshi News home page

‘టాక్సిక్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Aug 26 2026 11:56 AM | Updated on Aug 26 2026 1:09 PM

Toxic Movie Review And Rating In Telugu

టైటిల్‌: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్
నటీనటులు : యశ్‌, నయనతార, కియరా అద్వానీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్ష్మిణి వసంత్‌, డారెల్ డి సిల్వా తదితరులు
నిర్మాణ సంస్థలు: కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్
నిర్మాత: వెంకట్ కె. నారాయణ, యష్‌
కథ: గీతూ మోహన్‌దాస్‌, యష్‌
దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్‌
సంగీతం: విశాల్ మిశ్రా,రవి బస్రూర్,తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ
నేపథ్య సంగీతం: రవి బస్రూర్‌
సినిమాటోగ్రఫీ    రాజీవ్ రవి
విడుదల తేది: ఆగస్టు 26, 2026

‘కేజీఎఫ్‌ 2’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత యశ్‌ నుంచి వచ్చిన చిత్రం ‘టాక్సిక్‌’. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ సినిమా అనౌన్స్‌ చేశారు. అప్పటి నుంచి టాక్సిక్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్‌ కూడా చేశారు.  మొత్తంగా రిలీజ్‌ ముందు వరకు అయితే దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేయడంతో చిత్రబృందం సక్సెస్‌ అయింది. మరి రిలీజ్‌ తర్వాత కూడా ఆ స్థాయి సక్సెస్‌ని అందుకుందా? యష్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
ఈ సినిమా కథ 1947-67 మధ్య గోవా నేపథ్యంలో సాగుతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా ఇంకా పోర్చుగీసుల ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ డ్రగ్స్‌, అక్రమ వ్యాపారాలు, గ్యాంగ్‌ వార్‌ జరుగుతూనే ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌ సాల్వడార్(డారెల్ డి'సిల్వా) నేతృత్వంలో ఈ ఇల్లీగల్‌ దందాలన్నీ జరుగుతుంటాయి. ఈ క్రైమ్‌ ప్రపంచంలోకి అడుగుపెడతాడు రాయ(యశ్‌). పుట్టుగానే తల్లిదండ్రులను కోల్పోవడంతో అక్క గంగ(నయనతార) అన్నీ తానై తమ్ముడిని పెంచుతుంది. చిన్నప్పుడు ఎదురైన పరిస్థితుల ప్రభావంతో తమ్ముడిని గ్యాంగ్‌స్టర్‌గా మారేలా చేస్తుంది గంగ. రాయ ఓ సాధారణ వ్యక్తిగా గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచంలో వచ్చి.. అక్కడ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. 

అదే సమయంలో రాయల్‌ సర్కస్‌ కంపెనీ అమ్మాయి నడియా(కియరా అద్వానీ)తో ప్రేమలో పడతాడు. అప్పటికే సాల్వడార్ కూతురు రెబెకా (తారా సుతారియా)తో రాయకు పెళ్లి అవుతుంది.నడియా తన జీవితంలోకి వచ్చిన తర్వాత రాయ జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. డబ్బు, అధికారం కోసం జరిగే పోరులో ఆయన చేసిన తప్పులు ఏంటి? తమ్ముడిని గ్యాంగ్‌స్టర్‌గా చూడాలన్న గంగ కోరిక నెరవేరిందా? ప్రాణంగా ప్రేమించిన నడియా గర్భవతి అని తెలిసినా కూడా.. రాయ ఆమె ముఖాన్ని కూడా చూడకపోవడానికి గల కారణం ఏంటి? ఈ కథలో మెలిసా (రుక్మిణి వసంత్) పాత్ర ఏమిటి? ఒకవైపు గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచంలో ఆధిపత్యం కోసం జరిగే పోరు.. మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన.. ఈ రెండింటి మధ్య యశ్‌ చేసిన ప్రయాణమే ‘టాక్సిక్‌’ కథ. 

ఎలా ఉందంటే..
గ్యాంగ్‌స్టర్‌ కథలు అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి.  హీరో అనుకోని పరిస్థితుల్లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మారడం.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం.. ప్రత్యర్థులను ఎదుర్కొని డాన్‌గా ఎదగడం.. చివరకు తాను చేసిన తప్పులే తనకు ముప్పుగా మారడం..ఇలాంటి అంశాలతో ఎన్నో సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ‘టాక్సిక్‌’ కూడా ఇదే తరహా కథా నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమే. 

అయితే ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాకి కుటుంబ సంబంధాలు, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, విముక్తి వంటి అంశాలను జోడించి, కేజీయఫ్‌ తరహాలో భారీ ఎలివేషన్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు గీతూ మోహన్‌దాస్‌.  అయితే వయెలెన్స్‌, రొమాన్స్‌, ఎలివేషన్స్‌ ఉంటే చాలు జనాలు సినిమా చూసేస్తారు అనుకున్నారో ఏమో కానీ.. ఇందులో ఆ మూడు తప్ప మిగతావాటిపై కనీస శ్రద్ధ కూడా పెట్టలేదు. అసలు కథేంటి? ఏం చెప్పాలనుకున్నారు? చివరకు ఏం అర్థమైంది?... సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ థియేటర్స్‌ నుంచి బయటకు వస్తారు.

వయోలెన్స్‌, రొమాన్స్‌ తప్ప ఈ సినిమాలో ఇంకేమి ఉండదు. అయితే వాటిని కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా అంటే అదీ లేదు. రక్తం ఏరులై పారుతున్నా..తలలు తెగిపడి మొండాలు వేలాడుతున్నా.. ఎలాంటి రసానుభూతి కలగదు. భారీ భారీ యాక్షన్‌ సీన్స్‌, రొమాన్స్‌ సనివేశాలు.. సిస్టర్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ ఇవన్నీ ఉన్నా.. ఏ ఒక్కటి మైండ్‌లోకి దూసుకెళ్లదు. ఎందుకంటే.. అప్పటికే మన మైండ్‌లో యశ్‌ ఈ కథ ఎలా ఓకే చేశాడా? అనే ప్రశ్న తిరుగుతుంది.

ఉన్నంతలో ఫస్టాఫ్‌ పర్వాలేదు. యశ్‌ చెప్పే డైలాగులు, లొకేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ బాగుంటాయి. ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ కూడా కొంతవరకు పర్వాలేదు. ఇనీ సెకండాఫ్‌ మాత్రం భరించడం కష్టం. ముఖ్యంగా తండ్రి కొడుకుల రివేంజ్‌ డ్రామా మొదలైన తర్వాత కథనం నీరసంగా సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలతో ద్వితియార్థం బోరింగ్‌గా సాగుతుంది. సినిమా నిడివి(194 నిమిషాలు) ఎక్కువ ఉండడం కూడా ఈ సినిమాకు మరో మైనస్‌. కథనం ఆసక్తికరంగా సాగితే నిడివి ఎంత ఉన్నా పర్వాలేదు. కానీ ఈ సినిమా పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్‌ కాకపోవడంతో ‘ఇంకెప్పుడు అయిపోతుంది’ అనే భావన కలుగుతుంది. క్లైమాక్స్‌ కూడా అంతగా ఆకట్టుకోదు. మొత్తంగా టాక్సిక్‌ కథ ఒక గ్యాంగ్‌స్టర్‌ వార్‌లా మొదలై.. అక్కా-తమ్ముళ్లు సెంటిమెంట్‌తో సాగుతూ.. కాసేపటికే ప్రేమ వైపు యూటర్న్‌ తీసుకొని, తండ్రి-కొడుకుల మధ్య రివేంజ్‌ డ్రామాగా మారి, చివరకు సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ముగుస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 
యశ్‌.. వన్‌మ్యాన్‌ షో అని చెప్పాలి. కేజీయఫ్‌ తరహాలోనే ఇందులో కూడా గ్యాంగస్టర్‌ పాత్రలో అద్భుంగా నటించాడు.అయితే కేజీయఫ్‌లో బలమైన కథ ఉండడంతో ఆ పాత్ర బాగా ఎలివేట్‌ అయింది. కానీ టాక్సిక్‌లో అది లేదు. అందుకే రాయ పాత్రకు అంతగా కనెక్ట్‌ కాలేం. రాయ కొడుకు టికెట్‌ పాత్రలోనూ యశ్‌ నటించి మెప్పించాడు.   తెరపై కొత్తగా కనిపించాడు. రాయ అక్క గంగ పాత్రలో నయనతార ఒదిగిపోయింది. ఆమె ఇమేజ్‌కి తగ్గట్లుగా పాత్ర కుదిరింది. కానీ కథలో దమ్ములేనప్పుడు ఎంత మంచి పాత్ర దొరికినా ఏం లాభం. 

ఇక రాయ ప్రియురాలు నడియాగా కియరా అద్వానీ చక్కగా నటించింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్లు యువతను ఆకట్టుకుంటాయి.  తారా సుతారియా, రుక్మిణి వ‌సంత్  పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే చేశారు. డారెల్ డి సిల్వా పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది.  రవి బస్రూర్‌ నేపథ్య సంగీతం జస్ట్‌ ఓకే. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement