హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది.
రాజ్‌తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. 'ద ఫ్యామిలీ మ్యాన్' షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు.
(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)
పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్‌తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
సమంత.. గతంలో తెలుగు హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా శ్యామోలి అనే మహిళని 2015లో పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీళ్లు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా సామ్, రాజ్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.
(ఇదీ చదవండి:'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?)


