హీరోయిన్ సమంత.. దర్శకుడు రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి తెగ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సమంత అధికారికంగా ప్రకటించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఈ శుభకార్యం జరిగింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? ఇతడు తెలుగోడే అని మీలో ఎంతమందికి తెలుసు?
రాజ్ పూర్తి పేరు రాజ్ నిడిమోరు. పుట్టి పెరిగింది అంతా తిరుపతిలోనే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన వెంటనే ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే ఇతడికి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో (కృష్ణ దాసరి) పరిచయం ఏర్పడింది. అలా వీళ్లిద్దరూ స్నేహితులు అయ్యారు. కలిసి మొదటగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. అది సక్సెస్ కావడంతో 'ఫ్లేవర్స్' అనే ఇంగ్లీష్ మూవీ తీశారు. తర్వాత స్వదేశానికి తిరిగొచ్చేశారు.

మొదటగా హిందీలో '99' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తర్వాత తెలుగులో 'ఇంకోసారి' అనే చిత్రానికి రైటర్స్‌గా పనిచేశారు. మళ్లీ హిందీలో 'షోర్ ఇన్ ద సిటీ', గో గోవా డాన్ అనే మూవీస్ తెరకెక్కించారు. అనంతరం తెలుగులో 'డీ ఫర్ దోపిడీ' అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో నవీన్ పొలిశెట్టి ఓ హీరోగా నటించాడు. తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే రాజ్-డీకేకి 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. రెండో సీజన్ కోసం విలన్ పాత్ర కోసం సమంతని ఎంపిక చేశారు. అలా సమంత-రాజ్ మధ్య తొలి పరిచయం ఏర్పడింది. వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న టైంలో వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది.

కొన్నాళ్ల తర్వాత రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో సమంత లీడ్ రోల్ చేసింది. అప్పటినుంచి పలు సందర్భాల్లో రాజ్‌తో ఉన్న ఫొటోలని సమంత పోస్ట్ చేస్తుండేది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకున్నారు. గత కొన్ని నెలల్లో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. దీంతో త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు సడన్‌గా సమంతతో రాజ్ పెళ్లి అయిపోయింది. ఈ మేరకు సమంత ప్రకటన చేసింది.
సమంతకి ఇది రెండో పెళ్లి. అలానే రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలిని పెళ్లి చేసుకున్న రాజ్.. 2022లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. రాజ్ ఆస్తుల విషయానికొస్తే.. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.90 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. మిత్రుడు డీకేతో కలిసి డీ2ఆర్(D2R) అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇందులో ఇప్పటికే పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు నిర్మించారు.


