తనూజ, దివ్య మధ్య యుద్ధం.. అదంతా చూడటానికి ప్రేక్షకులు సిద్ధం అన్న రేంజ్‌లో బిల్డప్ ఇచ్చాడు బిగ్‌బాస్. కేవలం ఆ యుద్ధం కోసమే అర్ధాంతరంగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు. కానీ చివరకు ఏమైంది? ఈ ప్లాన్ పసిగట్టిన తనూజ గొడవకు ఫుల్‌స్టాప్ పెడదాం.. కలిసిపోదాం అనేసింది. ఇద్దరూ హగ్గిచ్చుకుని బిగ్‌బాస్ చెవిలో మందార పువ్వు పెట్టారు. దీంతో 11వ వారం తప్పించుకున్నా 12వ వారం తప్పక ఎలిమినేట్ అయింది దివ్య. ఆమె ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..
వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ
తెలుగు బిగ్‌బాస్ 9 ప్రారంభమైన కొత్తలో కామన్‌మ్యాన్ కేటగిరీలో వచ్చినవాళ్లు చేసిన ఓవరాక్షన్‌కు జనాలకు బీపీ వచ్చింది. వీళ్లనెవరైనా ఆపండ్రా.. అంటూ టీవీల ముందు జనం మొత్తుకున్నారు. ఎట్టకేలకు బిగ్‌బాస్ ఆ మొర ఆలకించి మళ్లీ అదే అగ్నిపరీక్ష నుంచి ముగ్గుర్ని హౌస్‌లోకి పంపాడు. ఈ ముగ్గురిలో అందరూ వద్దనుకున్న దివ్యనే హౌస్‌లో వైల్డ్‌కార్డ్‌గా ప్రవేశపెట్టాడు.

ముక్కుసూటితనానికి ఫిదా
ఆమె పదునైన మాటలకు, ఆటకు అందరూ ఫిదా అయ్యారు. తనూజలాంటివాళ్లే దివ్వెల మాధురికి గజగజ వణికిపోతుంటే దివ్య ఎదురెళ్లి నిలబడింది. తప్పును తప్పు అని గట్టిగా వాదించింది. ఇన్ని మంచి లక్షణాలున్న దివ్యకు రానురాను పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆమె హౌస్‌లో చేసిన రెండే రెండు తప్పుల వల్లే తను బయటకు వచ్చేసింది. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణితో బంధుత్వం కలుపుకోవడం!
పతనం మొదలైంది
భారీ ఓటింగ్ ఉన్న తనూజను అవసరం ఉన్నా, లేకపోయినా టార్గెట్ చేయడం అనేది తనకు వ్యతిరేకంగా మారింది. అందులోనూ భరణి, తనూజ అప్పటివరకు నాన్నకూతురిగా కలిసిమెలిసి ఉన్నారు. ఎప్పుడైతే దివ్య ఎంటరయిందో ఈ బంధం మధ్య దూరం పెరిగింది. ఈ విషయంలో దివ్యపై తనూజ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. భరణి నెం.1 అంటూ టాప్‌లో నిలబెట్టిన దివ్య.. అతడి ఎలిమినేషన్‌కు పరోక్షంగా కారణమైంది.

భరణిపై పెత్తనం
తీరా సెకండ్ ఛాన్స్‌తో హౌస్‌లోకి వచ్చిన భరణిపై ఆమె పెత్తనం చెలాయించడం ప్రేక్షకులకే కాదు, ఆఖరికి భరణి కుటుంబసభ్యులకు కూడా నచ్చలేదు. అది అందరూ చెప్తున్నా ఆమె చెవికెక్కించుకోలేదు. భరణి తనూజతో సన్నిహితంగా ఉంటే జీర్ణించుకోలేకపోవడం, ఆమెకు ప్రాధాన్యతనిస్తే తట్టుకోలేకపోవడం వంటివి ఆమెకే మైనస్ అయ్యాయి.
పొగరుగా
తెలుగురాని కంటెస్టెంట్ గౌరవ్‌ని చీపురుపుల్లలా తీసిపడేయడం, నానామాటలు అనడంతో తన గ్రాఫ్ మరింత పడిపోయింది. ఆట మీద కన్నా మనుషుల మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్లే ఫినాలేలో ఉండాల్సిన దివ్య () ఇప్పుడింట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


