
ఈసారి బిగ్‌బాస్ మరీ బోర్ కొట్టించేస్తోంది. కామనర్స్ అంటూ హడావుడి చేసి ఏకంగా ఆరుగురిని హౌసులోకి తీసుకొచ్చారు. వీళ్లు గేమ్స్ ఆడటం, ఎంటర్‌టైన్ చేయడం కంటే నస పెట్టడం, ఆటిట్యూట్ చూపించడమే ఎక్కువైపోతోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్‌తో పాటు చివరి నిమిషంలో లెక్కలు కూడా మారాయని తెలుస్తోంది. ఇంతకీ ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేశారు?
వారమంతా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ అంటే ప్రేక్షకులు బిగ్‌బాస్‌పై కాస్త ఆసక్తి చూపిస్తారు. అలా ఇప్పటికే శ్రష్ఠి, మనీష్ బయటకొచ్చేశారు. దీంతో ఈసారి ఎవరొస్తారా అనే అందరిలో టెన్షన్. ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని ఇప్పటికే హౌసులోకి పంపించారు. ఈమె బదులుగా ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని అడగ్గా అందరూ సంజన పేరు చెప్పారు. దీంతో ఈమెని శనివారం ఎపిసోడ్‌లోనే స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే ఈమెని నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అనేది ఈ రోజు తేలుతుంది.
(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)
మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా.. వీళ్లలో ప్రస్తుతానికైతే రాము ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉందట. గత కొన్నిరోజులుగా హౌసులో కాంట్రవర్సీలకు కారణమవుతున్న రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. చివరి మూడు స్థానాల్లో హరీశ్, కల్యాణ్, ప్రియ ఉన్నారట. అలా తక్కువ ఓట్లు పడిన ప్రియని ఈసారి ఎలిమినేట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సామాన్యుల నుంచి రెండో వికెట్ పడ్డట్లే. సీజన్ ప్రారంభంలో ఈమె కచ్చితంగా కొన్ని వారాలైనా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత త్వరగా ఎలిమినేషన్ అనేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియ కాస్తంత ఫాలోయింగ్‌తోనే హౌసులోకి వచ్చింది. కానీ తర్వాత ఏం చేయకుండా ముచ్చట్లు పెట్టడం, సెలబ్రిటీలపైన యాటిట్యూడ్ చూపించడం లాంటివి మాత్రమే చేస్తూ వచ్చింది. గతవారం సుమన్ శెట్టితో గొడవ లాంటివి కూడా ఈమెకు ఓ రకంగా మైనస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఇన్నింటి వల్ల ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్‌తో ఈసారి డబుల్ ఎలిమినేషనా లేదంటే ప్రియ ఒక్కతే హౌస్ నుంచి బయటకెళ్తుందా అనేది తేలుతుంది.
(ఇదీ చదవండి: మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్‌లా సంజనా)
