
డిమాన్ కెప్టెన్ అవ్వడం కోసం అడ్డదారులు తొక్కిన రీతూ చౌదరి (Rithu Chowdary)కి పెద్ద ఝలక్ తగిలింది. కెప్టెన్‌గా డిమాన్ ఒకర్ని సేవ్ చేయొచ్చంటే అతడు రీతూకి బదులుగా శ్రీజను సేవ్ చేశాడు. అది చూశాక రీతూ.. నా హార్ట్ బ్రేక్ అయిందంటూ ఏడ్చేసింది. అటు శ్రీజ.. ఓనర్లందరూ కలిసి తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదన్నారంటూ ఏడుపు అందుకుంది. దీంతో ఇమ్మూ రంగంలోకి దిగి నువ్వు నా చెల్లివి.. అని ఓదార్చడంతో తను కుళాయి కట్టేసింది. తర్వాత బిగ్‌బాస్ రీతూను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.
చికెన్ కోసం సీక్రెట్స్ బట్టబయలు
అక్కడ తనకెంతో ఇష్టమైన చికెన్ ఎదురుగా కనిపించేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది రీతూ. అమ్మ, అన్నయ్య నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతారు.. అంటూ వాళ్లను గుర్తు చేసుకుంది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల రహస్యాలు చెప్తేనే ఆ చికెన్ తినొచ్చన్నాడు. తనూజకు.. కల్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పైకి మాత్రం చూపించదు. అతడు దగ్గరుంటే తను సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. డిమాన్ గురించి అడగ్గా.. పవన్ సింగిల్, గతంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ తనకు కరెక్ట్‌గా ప్రపోజ్ కూడా చేయలేదు.

సీక్రెట్ చెప్పి సంజనా
దీంతో తను వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు ఎవర్నీ సరిగా ప్రేమించలేదన్నాడు. ఇప్పుడైతే నా మీద మంచి అభిప్రాయం ఉందన్నాడు అని ఉన్నదంతా చెప్పేసింది. ఇవి అందరికీ తెలిసినవేగా! మంచి రహస్యాలు కావాలన్నట్లుగా బిగ్‌బాస్ డిమాండ్ చేశాడు. దీంతో రీతూ.. సాయంత్రం లోపు కనుక్కుని మంచి సీక్రెట్స్ చెప్తానంది. అలా సంజనా దగ్గర ఓ రహస్యాన్ని కనుక్కుంది. సంజనా మాట్లాడుతూ.. కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. అయితే, అతడు నన్ను కొట్టేందుకు ప్రయత్నించాడు. నా తలపై కొడితే కుట్లు వేస్తారు.. ముఖం పాడవుతుంది, హీరోయిన్ కాలేను, అప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చనుకున్నాడు.
సినిమా చూపిస్తా
తర్వాత మా మధ్య గొడవై నేను వదిలేశాను. అప్పుడతడు పిచ్చోడై గడ్డం, మీసాలు పెంచాడు. ఓ రోజు కారు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్‌లో చనిపోయాడు అని చెప్పింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీల గురించి అందరికీ హింటిచ్చాడు. నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆటను నా చేతిలోకి తీసుకోబోతున్నా.. అసలు సినిమా ఎలా ఉంటుందో వచ్చేవారం చూపిస్తా.. జరగబోయేది మీ ఊహకు మంచి ఉండబోతోంది అన్నాడు. గార్డెన్ ఏరియాలో చెట్టుపై ఎవరి పేర్లు రాసి ఉన్న పండ్లను వారు తీసుకోవాలన్నాడు. అందులోని విత్తనం మీ భవిష్యత్తును సూచిస్తుందన్నాడు.

అప్పుడే ఇంటి నుంచి సందేశాలు
అయితే ఫలాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుకు రమ్మంటే రీతూ, ప్రియ, శ్రీజ ముందుకొచ్చారు. దీంతో వాళ్లు తమ పండ్లకు బదులుగా బిగ్‌బాస్ పంపిన మరో మూడు పండ్లను తలా ఒకటి తీసుకున్నారు. ఒక్కో రంగు విత్తనం దేన్ని సూచిస్తుందనేది సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. ముందుగా బ్లూ విత్తనం వచ్చినవారి (ఇమ్మాన్యుయేల్, సంజన, సుమన్ శెట్టి, తనూజ, ప్రియ)కి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు.
ఏడ్చేసిన ఇమ్మూ
ఇంటి నుంచి వచ్చిన సందేశాలను, జ్ఞాపకాలను గెలుచుకోవాలన్నాడు. ఇందుకోసం 100% ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా.. తండ్రి లెటర్ కావాలంటే బ్యాటరీలో 45%, తల్లి ఆడియో మెసేజ్ కావాలంటే 35%, ఫ్యామిలీ ఫోటో కావాలంటే 25% బ్యాటరీని వాడాల్సి ఉంటుందన్నాడు. అన్నింటికంటే తక్కువ బ్యాటరీ ఖర్చయ్యే ఫోటోను ఇమ్మూ సెలక్ట్ చేసుకుని ఎమోషనలయ్యాడు.