బిగ్‌బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.
అగ్నిపరీక్ష
ఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్‌బాస్ టీమ్‌కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.
అలాంటివారికి నో ఛాన్స్
వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్‌బాస్‌కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.

తొలిసారి ఏడుగురు కామనర్స్
మిగతావారి టాలెంట్, ఎక్స్‌ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు.
సామాన్యుడి చేతికి ట్రోఫీ
సామాన్యుడు బిగ్‌బాస్‌కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్‌పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది.
బిగ్‌బాస్ ప్లాన్ సక్సెస్
ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్‌ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్‌లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్‌బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది.
చదవండి: వినాయకన్‌కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం!


