మలయాళ నటుడు, జైలర్ విలన్ వినాయకన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ఆడు 3 సినిమా కోసం కేరళలోని తిరువనంతపురంలో యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చేస్తుండగా వినాయకన్ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు.
తప్పిన ప్రమాదం
ఈ సందర్భంగా వినాయకన్ మాట్లాడుతూ.. నా మెడ నరానికి దెబ్బ తగిలింది. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నరాల డ్యామేజ్‌ను ముందుగానే గుర్తించకపోయుంటే నా శరీరం చచ్చుబడిపోయేది అన్నాడు. డాక్టర్లు ఆయన్ను కనీసం ఆరువారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆడు 3 సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఆడు 3 మూవీ
ఆడు సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగమే ఆడు 3. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. వినాయకన్ విషయానికి వస్తే.. ఇతడు 1995లో వచ్చిన మాంత్రికం చిత్రంతో తన యాక్టింగ్ జర్నీ ప్రారంభించాడు.
సినిమా
'కమ్మట్టి పాదం' మూవీలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును గెల్చుకున్నారు. మలయాళంతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆయనకు రజనీకాంత్ జైలర్ ఊహించని స్థాయి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కేరళ పోలీస్‌స్టేషన్‌లో, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన గొడవతో.. అలాగే ఓ హోటల్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి వార్తల్లోకెక్కాడు.


