తెలుగు నటుడు, యాంకర్ నందు ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తనకు సరైన సక్సెస్ లేదు. ఆ ఒక్క విజయం కోసం ఏళ్లకొద్దీ పరితపిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సెకండ్ హీరోగా చేసిన నందు తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడితడు సైక్ సిద్దార్థ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఉన్నచోటే ఆగిపోయా..
ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందు తన కష్టాల్ని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. నందు మాట్లాడుతూ.. నాతో కలిసి నటించిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విజయ్ దేవరకొండ.. వీళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. నేను మాత్రం ఉన్నచోటే ఉండిపోయాను. లోపం నాలోనే ఉంది. అది ఈ మధ్యే తెలుసుకున్నాను.
లోపం నాలోనే..
కథలో లోపాలున్నాయని తెలిసినా సరే.. డబ్బు వస్తుందన్న ఆశతో సినిమాలు ఒప్పేసుకునేవాడిని. అలా నన్ను నేనే మోసం చేసుకున్నాను. దానివల్ల వీడి సినిమాలన్నీ ఇంతేరా.. అన్న మార్క్ పడిపోయింది. దాన్నుంచి బయటకు రావడానికే మూడునాలుగేళ్లు సమయం తీసుకుని మంచి సినిమా చేశాను.
చేదు సంఘటనలు
సవారి మూవీ తర్వాత పెద్ద బ్యానర్‌లో హీరోగా సినిమా ఆఫర్ చేశారు. అనుపమ హీరోయిన్ అన్నారు. అంతా ఓకే అనుకున్నాక సడన్‌గా నా స్థానంలో మరొకర్ని తీసుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరో సంఘటనలో ఏం జరిగిందంటే.. ఒక పెద్ద నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి మూవీ తీశారు. హీరోతోపాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర నాకిచ్చారు. పైసా తీసుకోకుండా రెండున్నర నెలలు షూటింగ్ చేేశాను.
ఘోర అవమానం
తీరా ఓ డిస్ట్రిబ్యూటర్ మూవీ చూసి నాకెందుకు అంత ప్రాధాన్యతనిచ్చారని అడిగారట! దాంతో నాకు ఒక్కమాటైనా చెప్పకుండా నా సీన్స్ అన్నీ ఎత్తేశారు. అది తెలియక ఆడియో లాంచ్‌కు పిలవకపోయినా వెళ్లాను. అక్కడికి వెళ్లాక కనీసం నేను ముందు వరుసలో కూర్చునేందుకు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను.
తల్లితోడుగా చెప్తున్నా..
అనవసరమైన విషయాల్లో నా పేరు ఇరికించినప్పుడైతే కుమిలిపోయాను. తల్లితోడుగా చెప్తున్నా.. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా? అని గీత, నేను అనుకున్నాము. వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్‌లో పని చేసుకుందాం అని గీతయే ముందుగా అడిగింది. తను సక్సెస్‌ఫుల్ స్టార్ సింగర్.. అయినా సరే నాకోసం తన కెరీర్ వదిలేసి, వేరే దేశం వెళ్లి హోటల్‌లో పనిచేసుకుందామంది. అది ఇప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది.
ఏడ్చేసిన నందు
నేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నాపై అలాంటి రూమర్సే రావు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవారిని బలిపశువును చేస్తారు. ఈ విషయం జనాలకు తెలియదు. లేనిపోనివాటిలో నన్ను ఇరికిస్తే బిల్డింగ్ పై నుంచి దూకేస్తానంది అమ్మ. అలా నేను చేయని తప్పుకు వార్తల్లో నా పేరు రావడం చూసి ఇంట్లో అందరూ నలిగిపోయారు అని చెప్తూ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.


