ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ఆర్యన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మన జీవితంలో ఎన్నో నేరాలను విని ఉంటాం, చూసి ఉంటాం. వాటిలో కొన్ని నేరాలు మాత్రం విస్మయానికి గురి చేస్తాయి. కానీ నేరం చేయడం అనేది ఓ ఆర్ట్. ఆ నేరం చేసేవాడు ఓ ఆర్టిస్ట్ అన్న స్టేట్‌మెంట్ ఓ సినిమా రూపంలో చెప్పాలంటే మాత్రం దర్శకుడికి బాగా ధైర్యం కావాలి. ఆ ధైర్యంతోనే తమిళ దర్శకుడు ప్రవీణ్ ఇటీవల ఓ సినిమా తీశారు. అదే ‘ఆర్యన్’. విష్ణు విశాల్ లీడ్ రోల్‌లో నటించి, నిర్మించిన చిత్రం ఇది. దర్శకుడు తాను చెప్పాలనుకున్నపాయింట్‌ని సినిమా మొదట్లోనే చెప్పి, ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాడు.
అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. కైలాష్ అనే సినిమా హీరోని లైవ్‌లో జనాల మధ్య నయన అనే ఫేమస్ జర్నలిస్ట్ తన ఛానల్‌లో ఇంటర్వ్యూ చేస్తుంటుంది. ఈ ప్రోగ్రాం మొదలవగానే ఆర్యన్ అనే వ్యక్తి ప్రేక్షకుల నుండి లేచి ఓ తుపాకీ చూపించి, తాను ఈ షోను హైజాక్ చేస్తున్నానని బెదిరించి కైలాష్ కాలి మీద కాలుస్తాడు. అంతేకాదు... వచ్చే ఐదు రోజులలో ఐదు మందిని తాను ప్రపంచానికి పేర్లు చెప్పి మరీ చంపుతానని చెప్పి లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి ప్రధానపాత్రలో ఉన్న నంబి దగ్గరకు ఈ కేసు విచారణకు వస్తుంది.
ఆర్యన్ చెప్పినట్టే వివిధ మాధ్యమాలలో చనిపోయే వారి పేర్లు ముందు తెలియపరుస్తూ రోజుకొకరు హత్య చేయబడుతుంటారు. ఓ దశలో చనిపోయిన శవం ఐదు హత్యలు చేస్తోందా? అన్న సందిగ్ధంలో పడేస్తుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ఈ మిస్టరీని నంబి ఎలా ఛేదిస్తాడో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ఆర్యన్’ సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే ఆయువుపట్టు. తాను చెప్పాలనుకున్నపాయింట్‌ని మొదటే తనపాత్ర ద్వారా చెప్పించి ప్రేక్షకులను లాక్ చేస్తాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఓ దశలో కొన్ని సీన్లు సాగదీతలా అనిపించినా థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా మంచి కాలక్షేపం. పిల్లలతో కాకుండా పెద్దవాళ్లు వీకెండ్‌లో చూడదగ్గ సినిమా ఇది. – హరికృష్ణ ఇంటూరు


