నేను చచ్చిపోతా.. నన్ను పంపించేయండి.. వెక్కెక్కి ఏడ్చిన సంజనా | Bigg Boss 9 Telugu: No Family Week for Sanjana Galrani | Sakshi
Sakshi News home page

Bigg Boss 9: తనూజకి క్లాస్‌.. సంజనాకు ఫ్యామిలీ వీక్‌ లేనట్లేనా?

Nov 16 2025 8:48 AM | Updated on Nov 16 2025 10:21 AM

Bigg Boss 9 Telugu: No Family Week for Sanjana Galrani

Bigg Boss Telugu 9: ఫైర్‌ స్ట్రామ్స్‌ అంటూ ఆరుగారు వైల్డ్‌కార్డ్స్‌ను హౌస్‌లోకి తెచ్చారు. వచ్చినవాళ్లందరూ వరుసగా ఎలిమినేషన్‌ బండెక్కి ఇంటికి వెళ్లిపోయారు. నిన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌ ఎలిమినేట్‌ అవగా ఈరోజు గౌరవ్‌ను పంపించేయనున్నారు. దీంతో ఫైర్‌ స్ట్రామ్‌ కాస్తా ఫెయిల్‌ స్ట్రామ్‌గా మిగిలిపోయింది. మరి శనివారం (నవంబర్‌ 15వ) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చూసేద్దాం..

పవన్‌కు క్లీన్‌ చిట్‌
బీబీ రాజ్యం అనే గేమ్‌లో రాణి దివ్య ఆదేశాల మేరకు పవన్‌.. తనూజను కాస్త తోసినట్లు చేశాడు. ఆమాత్రం దానికే తనూజ మ్యాన్‌ హ్యాండ్లింగ్‌ అంటూ పెద్ద నింద వేసింది. ఊరుకుంటే ఎత్తుకునేవాడివేమో అంటూ నానామాటలంది. దానిపై నాగ్‌ కాస్త సున్నితంగానే తనూజకు క్లాస్‌ పీకాడు. ఇక్కడ ఆడ,మగ తేడా లేదు. రాణి ఆదేశాలను పవన్‌ పాటించాడు తప్ప అతడు ఏ తప్పూ చేయలేదని క్లీన్‌ చిట్‌ ఇచ్చాడు.

సంజనాపై బిగ్‌ బాంబ్‌
ఇక హౌస్‌లో రెండు బిగ్‌బాంబ్స్‌ వేశాడు నాగ్‌. ఒకటి డబుల్‌ ఎలిమినేషన్‌ కాగా రెండోది చెప్పేముందు ఓ టాస్క్‌ ఇచ్చాడు. హౌస్‌లో మీకు సపోర్ట్‌గా ఉన్నదెవరు? మీ ఆటను ముంచుతోందెవరు? అనేది చెప్పాలన్నాడు. మెజారిటీ ఇంటిసభ్యులు సంజనా (Sanjana Galrani) వల్లే ఆట చెడిపోతుంది అని అభిప్రాయపడ్డారు. దాంతో రెండో బిగ్‌ బాంబ్‌ సంజన మీద పడుతుందని నాగ్‌ అన్నాడు. తీరా ఆ బాంబ్‌లో ఉన్నది మరేంటో కాదు, నో ఫ్యామిలీ వీక్‌.

గుక్కపెట్టి ఏడ్చిన సంజనా
ఇప్పటికే చంటిపిల్లలకు దూరంగా ఉన్న సంజనా.. రాత్రిళ్లు దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నా రోజంతా మాత్రం చలాకీగానే ఉంటోంది. ఫ్యామిలీ వీక్‌లో పిల్లలు వస్తారన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటిది తన కోసం ఎవరూ రారని అనడంతో గుక్కపెట్టి ఏడ్చింది. నేను ఇంటికెళ్లిపోతాను సర్‌.. నా వల్లకాదు, నేను చచ్చిపోతా.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను. ఇంక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేను అంటూ వెక్కెక్కి ఏడ్చింది.

నన్ను ఇంటికి పంపించేయండి సార్‌
ఇంట్లో మెజారిటీ హౌస్‌మేట్స్‌ నీవల్లే వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరేవాళ్ల పేరు వచ్చుంటే ఆ బాంబ్‌ ఇంకొకరిపై పడేది. ఇది బిగ్‌బాస్‌ నిర్ణయం అన్నాడు నాగ్‌. ఇంతలో కల్యాణ్‌, భరణి.. సంజనా కోసం తమ ఫ్యామిలీ వీక్‌ త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందుకు నాగ్‌ ఒప్పుకోలేదు. బాధను భరించలేకపోయిన సంజనా.. నన్ను ఇంటికి పంపించేయండి సార్‌, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు అని బతిమాలుకుంది. అప్పటికీ నాగ్‌ మనసు కరగలేదు. 

నిఖిల్‌ ఎలిమినేట్‌
అయితే నిజంగా ఫ్యామిలీ వీక్‌ లేకుండా పోయే ఛాన్సే లేదు. గతంలో కూడా తేజకు ఫ్యామిలీ వీక్‌ లేదన్నారు. కట్‌ చేస్తే చివర్లో అతడి తల్లిని పంపారు. ఇప్పుడు కూడా అలాగే చివర్లో సంజనా ఫ్యామిలీని పంపించి మరింత ఎమోషన్స్‌ రాబట్టి టీఆర్పీ దండుకునే ప్లాన్‌ చేస్తున్నారు. ఎపిసోడ్‌ చివర్లో నిఖిల్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. వారమంతా బాగానే కష్టపడ్డా సరే, ఇలా ఎలిమినేట్‌ చేశారేంటని నిఖిల్‌ షాక్‌ అయ్యాడు. అయినా చేసేదేం లేక సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు.

చదవండి: బిగ్‌బాస్‌ 9.. నిఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement