– టీనా శ్రావ్య
ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగించాలని, తోటివారి గౌరవానికి భంగం కలిగేలా ఉపయోగించడం మంచి విధానం కాదని చెబుతున్నారు హీరోయిన్ టీనా శ్రావ్య. హిట్ ఫిల్మ్ ‘కమిటీ కుర్రోళ్ళు’ (2024)తో వెండితెరపై కనిపించిన ఈ తెలుగమ్మాయి, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా టీనా పంచుకున్న విశేషాలు..
→ కొత్త సంవత్సరం (2026) నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతుందని ఆశిస్తున్నాను. విభిన్నమైన పాత్రలు చేసేందుకు నటిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను చేసే ప్రతి సినిమాలో ఓ కొత్త తరహా పాత్రతో ఓ యాక్టర్‌గా ఆడియన్స్ ముందుకు వెళ్లాలనుకుంటున్నాను.
→ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతి సంవత్సరం నేను కొత్త గోల్స్‌ను సెట్ చేసుకుంటూనే ఉంటాను. నా గోల్స్ పట్ల చాలా క్లియర్‌గా ఉంటాను. ఇందుకోసం రాజీ లేకుండా కష్టపడతాను. అదే సమయంలో నా ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు పాటిస్తాను. ఇంకా కొత్త తరహా నైపుణ్యాలను నేర్చుకోవాలనుకుంటున్నాను.
→ నిరంతరం కష్టపడుతూ ఉండటం, ఒదిగి ఉండటం వంటి లక్షణాలను నేను మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజాయితీగా ఉండటం, ఓర్పుతో నేర్పుగా మెలగడం ఈ ఇండస్ట్రీలో చాలా కీలకమని గ్రహించాను. ఇతర భాషలను నేర్చుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో నేను పోషించే ప్రతి పాత్ర తాలూకు స్వభావాన్ని లోతుగా ఎలా అధ్యయనం చేయగలననే విషయాల్లో మరింత మెరుగవ్వాలనుకుంటున్నాను. అప్పుడే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయగలనని భావిస్తున్నాను.
→ ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించాలి. తోటివారి గోప్యత, గౌరవానికి భంగం కలిగేలా వినియోగించకూడదు. ఫేక్ ఫోటోలను షేర్ చేస్తూ, వారిని ఇబ్బంది పెట్టకూడదు. మరీ ముఖ్యంగా ఈ తరహా దుర్వినియోగం నుంచి మహిళలను రక్షించేందుకు కఠినమైన చట్టాలు ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా కొత్త సినిమాలను గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను.


