ఇదో చిన్న సమస్య.. కాకపోతే డ్యామేజ్ మాత్రం? | Do English Titles Really Affect Telugu Movie Success? How Titles Influence Box Office Reach, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Telugu Movies: నిజంగా ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావట్లేదా?

Feb 18 2026 1:45 PM | Updated on Feb 18 2026 1:56 PM

Is English Titles Issue Of Telugu Movies Latest

ఓ సినిమా సక్సెస్ అనేది ఎలా అయితే చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందో.. ఫ్లాప్‌కి చాలానే అంశాలు కారణమవుతుంటాయి. కాకపోతే కొన్నిసార్లు చిన్న సమస్యల్లా అనిపించినవి కూడా పెద్ద డ్యామేజ్ చేస్తున్నాయా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. అలాంటిదే ఇది. ఇంగ్లీష్ టైటిల్స్ అనేది తెలుగు సినిమాలకు ఎప్పటి నుంచో పెడుతున్నారు. కాకపోతే అవి ఏమంత కలిసి రావట్లేదా? అనేది సందేహంగా మారింది.

(ఇదీ చదవండి: వేల కోట్ల బడ్జెట్ మూవీ.. ఏఐతో ఒక్కరోజులోనే తీస్తే?)

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి టైటిల్స్ పెట్టిన అవి జనాల్లోకి త్వరగానే వెళ్లిపోతాయి. ఒకవేళ ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే.. పలకడం కష్టమైతే ఫలానా చిరంజీవి సినిమా అనో లేదంటే మహేశ్ బాబు సినిమా అనో పిలుస్తారు. కానీ మీడియం, తక్కువ మందికి తెలిసిన హీరోల మూవీస్ టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్ కంటే తెలుగులోనే ఉంటే కాస్త మంచిదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు గత రెండు నెలల్లో వచ్చిన కొన్ని సినిమాలనే తీసుకుందాం.

గతేడాది డిసెంబరులో తిరువీర్ అనే చిన్న హీరో చేసిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ రావడంతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అన్నప్పటికీ జనాలకు ఇది పెద్దగా రీచ్ కాలేదు. ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం ఓ కారణమైతే సగటు మాస్ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా టైటిల్ పెట్టకపోవడం కూడా ఓ కారణం అనుకోవచ్చు. స్టోరీకి తగ్గట్లే టైటిల్ పెట్టినప్పటికీ అది చాంతాడంత పొడుగ్గా ఉండటం, చెప్పడానికి నోరు తిరగనంత పెద్దగా ఉండటం కూడా మూవీ పెద్దగా రీచ్ కాకపోవడానికి కారణమే అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)

ఈ నెల తొలివారంలో దర్శకుడు గుణశేఖర్ తీసిన 'యుఫోరియా' అనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీనికి కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. టైటిల్ ఇంగ్లీష్‌లో పెట్టడం, దీని అర్థం కూడా చాలామందికి తెలియకపోవడం కూడా ఓ రకంగా మైనస్ అయ్యిందేమో అనిపిస్తుంది. చాలామంది చదువుకున్న వాళ్లు కూడా ఈ పదానికి అర్థం ఏంటని టక్కున అడిగితే చెప్పలేరు. అలాంటిది బీ,సీ సెంటర్లలో ఉండే ఆడియెన్స్‌కి ఈ టైటిల్, మూవీ గురించి ఏమనిపించి ఉంటుంది.

ఇకపోతే గతవారం రిలీజైన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు కూడా పాజిటివ్ టాకే వచ్చింది. మీడియా, అర్బన్ ఆడియెన్స్ బాగానే దీనికి కనెక్ట్ అయ్యారు. కానీ బీ,సీ సెంటర్లలో దీనికి పెద్దగా వసూళ్లు రావడం లేదు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ ఆధరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్స్ లేకపోవడం లాంటిది కాస్త మైనస్ అయితే.. ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం కూడా ఈ చిత్రానికి ఏమైనా మైనస్ అయిందా అనిపిస్తుంది. ఇవే కాదు గత రెండు దశాబ్దాల కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్‌తో వచ్చిన చాలా తెలుగు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఎక్కువశాతం బోల్తాకొట్టాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌, డీజే టిల్లు, మేజర్‌, హిట్‌ తదితర సినిమాలు.. ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ అయ్యాయి. పలు సినిమాలు మంచి విజయాలు కూడా సాధించాయి. కానీ మేజర్‌గా ఫ్లాప్‌ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని సినిమాల విషయంలోనూ ఇలానే జరుగుతుందని చెప్పలేం కానీ అదృష్టం బాలేకపోతే టైటిలే సినిమాకు ఉరితాడు అయ్యే అవకాశముంది!

(ఇదీ చదవండి: ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నువ్వే: చిరంజీవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement