మలయాళ స్టార్ మమ్ముట్టి గతేడాది జూన్‌లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఆరోగ్యం కుదుటపడ్డాకే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. తాజాగా ఆయన తొలిసారి తన అనారోగ్యం గురించి మాట్లాడాడు. మనిషికి కంటిచూపు, వినికిడి చాలా ముఖ్యమైనవి. అయితే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే కొంత ఆందోళన కలుగుతుంది. నేను కూడా కొంతకాలం అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నాను.
లేనప్పుడే విలువ తెలుస్తుంది
చాలాకాలం రుచి, వాసన కోల్పోయాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తిరిగి పొందుతున్నాను. అయితే ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుంది. వినడం, వాసన గ్రహించడం, రుచి చూడటం వంటి సామర్థ్యాల ప్రాధాన్యత చాలామంది పట్టించుకోరు. వాటి శక్తి నెమ్మదించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడమని చెప్తాం. ఎందుకంటే మనం వినగలుగుతున్నాం. కానీ వినికిడి శక్తి లేనివారు ఏదీ అనకుండా సైలెంట్‌గా ఉంటారు. ఎవరెలా మాట్లాడినా వారికి తేడా ఉండదు. వినగలగడం కూడా ఒక వరం అని చెప్పుకొచ్చాడు.
కెరీర్
మమ్ముట్టి 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో జన్మించాడు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ చదివిన ఆయన రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. 1971లో అనుభవంగళ్ పాలిచకల్ మూవీలో ఓ చిన్నపాత్రతో నటన ప్రారంభించాడు. విల్కన్ ఉండూ స్వప్నంగళ్ సినిమాతో హీరోగా మారాడు. ఏడాదికి ఇరవైకి పైగా సినిమాలు చేశాడు. అలా దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకుగానూ మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు వరించింది. ప్రస్తుతం ఈయన పాత్ర, పేట్రియాట్ సినిమాల్లో నటిస్తున్నాడు.
చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానం: సుహాస్


