ఛోళీకే పీఛే క్యాహై అనే ఖల్‌నాయక్‌లో పాట గుర్తున్నవాళ్లకి మాధురీ దీక్షిత్, సంజయ్ దత్‌లతో సమానంగా గుర్తుండే మహిళ నీనాగుప్తా. సినిమాల్లో నటనకు మాత్రమే కాదు అత్యంత స్వేఛ్చాయుత వ్యక్తిగత జీవితం ద్వారా బాలీవుడ్ టాప్ స్టార్స్ కన్నా మిన్నగా ఆమె గుర్తొస్తారు. మహిళల వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రంపై ఆమె తరచుగా వెల్లడించే అభిప్రాయాల సందర్భంలో నీనా వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఆమె 30 సంవత్సరాల వయసులో పెళ్లికాకుండానే ఒంటరి తల్లి అయ్యింది. ఆమె కుమార్తె మసాబా రాకను సంతోషంగా స్వాగతించింది. వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తన బిడ్డకు తండ్రి అని ఆ తర్వాత వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఆమె అంతే స్వేఛ్చగా తన జీవితం గడుపుతూ వస్తోంది. అయితే తన నిర్ణయాలతో తనకు బాగుండవచ్చునని, అందరినీ అదే దారి ఎంచుకోవాలనే సలహా తాను ఇవ్వబోనని తరచుగా ఆమె స్పష్టం చేస్తుంటారు.
ఈ నేపధ్యంలో...మన దేశంలో మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షాపూరిత వాస్తవాల గురించి ప్రముఖ నటి నీనా గుప్తా మరోసారి కుండ బద్ధలు కొట్టారు. ఆధునిక సమాజపు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందనీ, విశాల థృక్పధం గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఆమె నిర్ధ్వందంగా తిప్పికొట్టారు. ఇటీవల ఓ మీడియాతో జరిపిన సంభాషణలో, ఈ సీనియర్ నటి పితృస్వామ్యం, పురుషాధిక్యత ఇప్పటికీ వివాహం తర్వాత మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె ఎత్తి చూపారు.
ఈ సంభాషణ సందర్భంగా భారతీయ సంప్రదాయ సమాజంలో వధువు కన్యత్వం పట్ల ఇంకా కొనసాగుతున్న వ్యామోహాన్ని నీనా ప్రస్తావించారు. నేటికీ కన్యత్వం అంత ముఖ్యమైన అంశంగా ఉందా అని అడిగినప్పుడు, భారతదేశం గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ ఇప్పుడు ఏం మారింది? అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘మగ వారు భార్యను కన్యగానే కోరుకుంటున్నారు‘ అని ఆమె అన్నారు.
కొంత వరకూ నగరాల్లో, ఇంగ్లీష్ మాట్లాడే మగ వారు చూడడానికి చాలా విశాల మనస్తత్వం ఉన్నట్టు కనిపిస్తారని అయితే అది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ’వారు కూడా కన్యనే భార్యగా కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారామె.
పరిస్థితులు మారిపోయాయనే ఊహను నీనా ప్రశ్నించింది. ‘మన దగ్గర జనం ఓపెన్‌గా ఉంటారని ఎలా అంటున్నారు? అదొక్కటే కాదు మన దేశంలో చాలా విషయాలు ఇప్పటికీ మారలేదు. మహిళలు ఇప్పటికీ తలపై కొంగు కప్పుకుని ఆ తర్వాత మామగారి పాదాలను తాకుతారు. ఇక్కడ నువ్వూ నేనూ మైనారిటీలం, మనం నిజమైన భారతదేశం కాదు. చక్కగా దుస్తులు ధరించి, చక్కగా మాట్లాడే మనలాంటి వారు భారతదేశం కాదు.‘ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారామె. తన అభిప్రాయాన్ని బలపరిచేలా నీనా తన సొంత కుటుంబంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.
‘నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా తండ్రి వైపు ఉన్న ఒక బంధువుల అమ్మాయి ముంబైలో ఒక పెద్ద సంస్థలో పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒకసారి నా తండ్రి ఆ అబ్బాయి, అమ్మాయి ఆమె కుటుంబాన్ని తన ఇంటికి మాట్లాడటానికి పిలిచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముంబైలో ఆ అబ్బాయి, అతని కుటుంబంతో ఇకపై నివసించడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి అలాంటి వివక్ష ఎదుర్కుంది మరి. కనీసం తనకు నచ్చిన దేవుడ్ని పూజించడానికి కూడా ఆ అమ్మాయిని అనుమతించలేదట. ఆ అమ్మాయి సాయి బాబా అంటే ఇష్టం కాబట్టి బాబా ఫొటోను తన గదిలో ఉంచితే ఆమె అత్తగారు దానికి కూడా అనుమతించలేదు. తాము పూజించే ఓ గురువు ఫొటోనే పెట్టాలని ఆదేశించింది‘ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
తర్వాత ఆమె మరొక సంఘటనను ఉదహరించారు. ‘నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. ఇది నా మేనకోడలికి సంబందించింది. ఆమెను ఆమె అత్తగారు తన కుటుంబ ఫోటోను తన పడక టేబుల్‌పై పెట్టుకోవద్దని అడ్డుకున్నారు’’ అంటూ పంచుకున్నారామె. ఏదేమైనా దేశంలోని మహిళల స్థితిని మార్చే విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు.


