వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్‌లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...
ఇమ్మూతో గొడవ
నీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్‌షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్‌గా ఫీలవుతా.. అది నా వీక్‌నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు.

నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకు
మూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది.
తనూజకు నాగ్ సలహా
సారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు.

రీతూ గెలిస్తేనే ఆఫర్
ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్‌కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్‌ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.
గౌరవ్ ఎలిమినేట్
కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.


