'ద కేరళ స్టోరీ' సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆపై ది కేరళ స్టోరీ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తీవ్రంగా తప్పుబట్టారు. మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు ఇలాంటి గౌరవాన్ని కల్పించడం అనేది దారుణమన్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది.
కేరళలో కొన్నేళ్లుగా మహిళలు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారు అదృశ్యమైనట్లు వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ 'ద కేరళ స్టోరీ'ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతున్నట్లు సమాచారం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయిందట. సీక్వెల్‌లో భయంకరమైన చీకటి కథను ప్రపంచానికి చూపించనున్నారని ప్రచారం ఉంది. పార్ట్-2 షూటింగ్ పనులను కఠినమైన భద్రతతో నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా పూర్తి చేశారట. ఫిబ్రవరి 27న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని కూడా ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


